Narendra Modi: ఇదొక మంచి అవకాశం.. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • విశ్వాస తీర్మానానికి ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ
  • ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ప్రధాని మోదీ
  • చివరి బంతికి సిక్స్‌ కొడతామని ధీమా
  • ప్రతిపక్ష కూటమికి ఈ తీర్మానం ఓ కార్యక్రమం మాత్రమేనని వ్యాఖ్య
  • కానీ ఇది మనకు మంచి అవకాశమని వ్యాఖ్య
we will hit sixer at last ball pm modi on no confidence motion

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఈ విషయంలో చివరి బంతికి సిక్స్‌ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. 

‘‘ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన తీర్మానం.. వారికి ఓ కార్యక్రమం మాత్రమే. కానీ ఇది మనకు మంచి అవకాశం. అవినీతి, కుటుంబ రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్ని ఉంచాలన్న ఎన్‌డీఏ నినాదం అలానే ఉంది” అని అన్నారు. అది అహంకారుల కూటమి అని, అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 

ఇక ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ ప్రారంభించారు. సభలో సంఖ్యాబలం తమకు లేకున్నా.. అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిన పరిస్థితిని తమకు కల్పించారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు మొత్తం 16 గంటల సమయాన్ని స్పీకర్ ఓం బిర్లా కేటాయించారు. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 15 మంది ప్రసంగించనున్నారు.

More Telugu News