Chandrayaan-3: 100 కిలోమీటర్ల వరకూ ఓకే.. ఆ తరువాతే..!: 'చంద్రయాన్-3' ల్యాండింగ్ పై ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్య

  • చంద్రయాన్-3లో ఆర్బిట్ డిటర్మినేషన్ దశ అత్యంత కీలకమన్న ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్‌నాథ్
  • చంద్రుడికి 100 కీమీల దూరానికి చేరుకున్నాక చంద్రయాన్-3 లోకేషన్ కచ్చితంగా నిర్ధారించాలని వెల్లడి
  • ఇప్పటివరకూ అంతా అనుకున్నట్టు జరిగిందని ప్రకటన
  • చంద్రయాన్-2 అనుభవం చంద్రయాన్-3లో ఉపయోగపడిందన్న ఇస్రో చైర్మన్
ISRO chairman talks about most critical phase of chandrayaan 3 which begins beyond 100 km from moons surface

చంద్రయాన్-3 వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ మీడియాకు తెలిపారు. అయితే, వ్యోమనౌక చంద్రుడికి 100 కిలోమీటర్ల సమీపానికి చేరుకున్నాకే కీలక దశ మొదలవుతుందని చెప్పారు. ఆ తరువాత చంద్రయాన్-3 చంద్రుడికి ఎంత ఎత్తులో ఉందనేది భూమ్మీద నుంచి కచ్చితంగా నిర్ధారించడం అత్యంత కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ దశను ఆర్బిట్ డిటర్మినేషన్ ప్రాసెస్‌ అంటారని వివరించారు. 

‘‘చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావిస్తున్నాం. ఆ తరువాత చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలం నుంచి ఎంత దూరంలో ఉందనేది కచ్చితంగా నిర్ధారించాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా జరిగితే మిగిలిన వ్యవహారమంతా సులువుగా పూర్తవుతుంది. ఈసారి అంతా సక్రమంగా జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పటివరకూ కక్ష్య మార్పులన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయి. ఈ క్రమంలో చంద్రయాన్-2 అనుభవం మాకు బాగా లాభించింది. అప్పట్లో తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై నిశితంగా అధ్యయనం చేశాం. ఈ అనుభవంతో చంద్రయాన్-3లో పలు మార్పులు చేశాం’’ అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు.

జూన్ 14న ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 శ్రీహరి కోట నుంచి నింగిలోకి ఎగసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యోమనౌక చంద్రుడి చుట్టూ 170/4313 దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. 'చంద్రయాన్' వ్యోమనౌకను జాబిల్లికి మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఇస్రో ఆగస్టు 9, 17న కక్ష్య కుదింపు చర్యలు చేపట్టనుంది. అంతా సక్రమంగా సాగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.

More Telugu News