Chiranjeevi: రీమేక్ చేస్తే తప్పేంటి? : 'భోళాశంకర్' ఈవెంటులో చిరంజీవి

  • అభిమానుల సమక్షంలో జరిగిన 'భోళాశంకర్' ఈవెంట్
  • రీమేకులు చేయడం తప్పుకాదన్న చిరంజీవి 
  • తన కెరియర్ చిన్న చిన్న వేషాలతో మొదలైందని వెల్లడి 
  • ప్రేక్షకుల ఆదరణ వల్లనే ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్య

Bhola Shankar movie pre release event

'భోళాశంకర్' సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు రానుంది. ఆ తేదీ కోసం మెగా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో చిరంజీవి మాట్లాడుతూ .. "అమ్మ ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అలాగే అభిమానుల కేరింతలు కూడా ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంటాయి. నా అభిమానులు గర్వపడేలా ఉండటం కోసమే నేను నా నడవడికను మార్చుకుంటూ ఈ స్థాయి వరకూ వచ్చాను" అని అన్నారు. 

"ఈ సినిమా చేసేటప్పుడు ఎప్పుడో వచ్చిన 'వేదాళం' రీమేక్ ఇప్పుడు చేయడం అవసరమా? అని చాలామంది అడిగారు. మంచి కంటెంట్ ఉన్నప్పుడు రీమేక్ చేయడం తప్పేముంది? పైగా 'వేదాళం' సినిమా ఏ ఫ్లాట్ ఫామ్ పై లేదు. ఆ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతనే ఈ రీమేక్ ను మొదలుపెట్టడం జరిగింది. ఈ కథ నాకు నచ్చడం వలన .. మెహర్ రమేశ్ టాలెంట్ పై నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది" అని చెప్పారు. 

"నేను చిన్న చిన్న వేషాలు వేస్తూ నా కెరియర్ ను మొదలుపెట్టాను. అలాంటి నేను ఈ రోజున ఈ స్థాయికి .. ఈ స్థానానికి చేరుకోవడానికి కారణం ప్రేక్షకులే. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన డబ్బుతోనే నిర్మాతలు సినిమాలు మొదలుపెట్టేవారు. ప్రేక్షకులు నాపై చూపుతున్న అభిమానం వాళ్లను ప్రభావితం చేసింది. దాంతో వాళ్లు నా పేరును నిర్మాతలకు సూచించేవారు" అని అన్నారు. 

 'చిరంజీవి అనే కొత్త కుర్రాడు డాన్సులు .. ఫైట్లు .. కామెడీ బాగా చేస్తున్నాడు, అతని సినిమాలను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు .. అతనితో సినిమాలు చేయండి' అని నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా ప్రేక్షకులే నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చారు. ఈ సినిమాలో నేను హుషారుగా చేయడానికి కారణం మీరిచ్చిన ఎనర్జీనే " అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News