MIM: బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల కట్టుకథలతో ‘డిసెంబర్ 6’ ఘటనలు పునరావృతం: అసదుద్దీన్ ఓవైసీ

  • జ్ఞానవాపి మరో బాబ్రీ కాకూడదంటూ ఎంపీ వ్యాఖ్యలు
  • కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటన
  • సీఎంను మార్చేదాకా మణిపూర్ లో అల్లర్లు చల్లారవని వెల్లడి
MIM MP Asaduddin Owaisi Press meet

జ్ఞానవాపి మసీదు విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కట్టుకథలను ప్రచారం చేస్తున్నాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ ప్రచారాల వల్ల ‘డిసెంబర్ 6’ నాటి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈమేరకు శనివారం ఎంఐఎం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జ్ఞానవాపి మసీదు విషయంలో కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే, మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహిస్తున్న సర్వే, ఆ తర్వాత ఇచ్చే నివేదిక వల్ల బాబ్రీ మసీదు విషయంలో జరిగిన అల్లర్ల ఘటనలు మళ్లీ జరిగే అవకాశం ఉందని అసదుద్దీన్ తెలిపారు. జ్ఞానవాపి అంశం మరో బాబ్రీ మసీదు కాకూడదని చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లపైనా ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. హర్యానాలో ముస్లింల ఇళ్లను బీజేపీ సర్కారు అన్యాయంగా కూల్చివేస్తోందని మండిపడ్డారు. మణిపూర్ లో అల్లర్లు ఆగాలంటే అక్కడి ముఖ్యమంత్రిని మార్చాల్సిందేనని, సీఎంను మార్చేదాకా ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనే పరిస్థితి లేదని ఎంపీ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ విలీన బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ అసదుద్దీన్.. గవర్నర్ తమిళిసై వెంటనే బిల్లుపై సంతకం చేసి అసెంబ్లీకి పంపించాలని డిమాండ్ చేశారు.

More Telugu News