YS Sharmila: కేటీఆర్ చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పనికి మాలిన పనులు: షర్మిల

YS Sharmila fires at Minister KTR
  • ఉద్యమం సమయంలో భూములు అమ్మవద్దని చెప్పారన్న షర్మిల
  • తెలంగాణ సాధించాక ప్రభుత్వ భూములపై దందా చేస్తోందని విమర్శ
  • తొమ్మిదేళ్లలో 38వేల ఎకరాలు ఎందుకు విక్రయించారని ప్రశ్న
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పనికి మాలిన పనులని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా చిన్న దొర అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు అమ్మవద్దని గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన ఊకదంపుడు మాటలకు స్వరాష్ట్రంలో ప్రభుత్వ భూములపై చేస్తున్న దందాకు పొంతనే లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ పని కాకుంటే మీ తొమ్మిదేళ్ల పాలనలో 38 వేల ఎకరాలు ఎందుకు అమ్మినట్లు? అని ప్రశ్నించారు.

భూములు వెతికి మరీ 'ఫర్ సేల్' బోర్డులు ఎందుకు పెడుతున్నారు? ఇదే కాకుండా మరో 50 వేల ఎకరాలు అమ్మడానికి కసరత్తు ఎందుకు చేస్తున్నారు? అని నిలదీశారు. తెచ్చిన అప్పులు కమీషన్ల కింద.. రాష్ట్ర ఆమ్దానీ విలాసాల కింద ఖర్చు పెడుతున్న రాబందులకు, భూములు అమ్మకపోతే పొద్దు గడవదన్నారు. అందుకే బీఆర్ఎస్ అంటే భూములమ్మే రాష్ట్ర సమితి అంటూ కొత్త అర్ధాన్ని చెప్పారు. సర్కారీ భూములు మింగేసే భూభకాసుర రాష్ట్ర సమితి అని ఆరోపించారు. భవిష్యత్ అవసరాలకు భూములు లేకుండా కొల్లగొట్టే బందిపోట్లకు బుద్ధి చెప్పకపోతే రేపు రాష్ట్రాన్ని సైతం వేలం వెయ్యకమానరని ప్రజలను హెచ్చరించారు.
YS Sharmila
KTR
Telangana

More Telugu News