Chandrababu: పుంగనూరు పుడింగీ... ఎవడ్రా నువ్వు?: శ్రీకాళహస్తి సభలో చంద్రబాబు ఫైర్

  • శ్రీకాళహస్తిలో చంద్రబాబు సభ
  • పోటెత్తిన జనాలు
  • తనకు ప్రాణాలంటే భయంలేదని టీడీపీ అధినేత వెల్లడి
  • నువ్వు ఒక్క దెబ్బ కొడితే నేను రెండు కొడతానని వార్నింగ్
  • వాడొక బొత్స ఉన్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు
Chandrababu fires on YCP leaders in Srikalahasti

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్ షో, సభ నిర్వహించారు. చంద్రబాబు సభకు జనాలు పోటెత్తారు. నిన్న అంగళ్లు, పుంగనూరులో జరిగిన సంఘటనల నేపథ్యంలో, శ్రీకాళహస్తి సభలో చంద్రబాబు నిప్పులు చెరిగేలా ప్రసంగించారు. 

తాను తీవ్రవాదంపై పోరాడానని, 24 క్లేమోర్ మైన్లు పేల్చినా తాను బతికానని స్పష్టం చేశారు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వరస్వామే తనను కాపాడారని వెల్లడించారు. ఈ రాష్ట్రానికి నా అవసరం ఉందని వెంకటేశ్వరస్వామి నాడు నన్ను బతికించారు అని తెలిపారు. తాను దేనికీ భయపడే వ్యక్తిని కానని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"అలాంటి నేను నిన్న అంగళ్లు వస్తే అడ్డుకోవాలని, దాడి చేయాలని ప్రయత్నించారు. మనవాళ్లు గట్టిగా ప్రతిఘటించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అక్కడి నుంచి పుంగనూరు మీదుగా పూతలపట్టు వెళ్లాలనుకున్నాను. కానీ నేను పుంగనూరు మీదుగా వెళ్లకూడదంట... ఈ పుంగనూరు పుడింగి చెబుతాడు. ఎవడ్రా నువ్వు... ఏం తమాషాగా ఉందా నీకు? ఏమనుకుంటున్నారు మీరు? 

అక్కడ్నించి నేను పుంగనూరు వెళితే హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వైసీపీ వాళ్లు దాడులు చేసేందుకే వచ్చారు. వారిని పోలీసుల గృహ నిర్బంధం చేయాలా, వద్దా? కానీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. 

ఇవాళ శ్రీకాళహస్తికి నేను వచ్చాను... ఇక్కడ ప్రశాంతంగా సభ జరుగుతోంది... కారణం ఏంటంటే ఇక్కడికి వైసీపీ దొంగలు రాలేదు కాబట్టి. మన మీద దాడికి వస్తే ఏం చేస్తాం... తిరగబడతాం. నువ్వు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్ర తీసుకొస్తా... నువ్వు ఒక్క దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొడతా. వివేకా మాదిరి గొడ్డలితో చంపితే, చచ్చిపోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. 

రాష్ట్రమంటే ఏమనుకుంటున్నారు... ప్రజలనుకున్నారా, పశువులు, కోళ్లు అనుకున్నారా... కోసుకుని తినేయడానికి! సైకో పోవాలని పోస్టర్లు పెడితే తొలగిస్తున్నారు... ఆ పోస్టర్లతో కలెక్టర్లు, ఎస్పీలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? నిన్న జరిగిన ఘటనల పట్ల సిగ్గులేని నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు. 

గ్రేట్ డీఐజీ ఉన్నారు.... నేను పుంగపూరులోకి పోయానంట. ఆ పుంగనూరు పుడింగి చెబితే నువ్వు నమ్ముతావా? పుంగనూరులోకి వెళ్లానా నేను... బైపాస్ రోడ్ లో వచ్చానంతే. వాడొక బొత్స ఉన్నాడు.... నేను పుంగనూరు వెళ్లానంట... అందుకే దాడులు జరిగాయంట... లేకపోతే ఈయన నాకు భద్రత కల్పిస్తాడంట! బుద్ధి, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా! నన్ను కూడా గొడ్డలివేటుతో లేపేయాలనుకుంటున్నారా... అది మీ వల్ల కాదు. కార్యకర్తలే నాకు శ్రీరామరక్ష" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News