KTR: రేవంత్‌రెడ్డి అంతు చూస్తాం.. పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సిందే!: అసెంబ్లీలో కేటీఆర్

  • కేసీఆర్, అధికారుల పట్ల రేవంత్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజం
  • వాక్ స్వాతంత్య్రం ఉందని ఎటుపడితే అటు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • హైదరాబాద్‌కు 450 ఏళ్ల చరిత్ర ఉందని వ్యాఖ్య
  • తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూద్దామని సవాల్
KTR fires at Revanth Reddy in Assembly

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారుల పట్ల ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఆయన అంతు చూస్తామని, కచ్చితంగా పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సిందేనని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శనివారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ... వాక్ స్వాతత్య్రం ఉందని ఎటుపడితే అటు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్‌ను ఏది పడితే అది మాట్లాడుతారా? అని ధ్వజమెత్తారు. సీఎంతో పాటు అధికారుల పట్ల రేవంత్ మాటలేమిటని అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీశారు. ఇప్పటికే ఆయనపై వెయ్యి కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారని, తామూ వేస్తామన్నారు. రేవంత్ ఆరోపణలపై హెచ్ఎండీఏ, అలాగే ఆ టెండర్ వచ్చిన సంస్థ పరువు నష్టం దావా వేసిందని, ఈ వ్యాజ్యం కోర్టులో ఉందన్నారు.

హైదరాబాద్‌ను తానే కట్టానని ఓ పెద్ద మనిషి చెబుతాడని, 450 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ ఎంతో చేశారని, కానీ తానే చేశానని చెప్పడం సరికాదన్నారు. అందరూ కొన్ని మంచి పనులు చేశారన్నారు. ఓఆర్ఆర్‌ను, మెట్రోను కాంగ్రెస్ ప్రారంభిస్తే తాము పూర్తి చేశామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని తెచ్చారని ధైర్యంగా చెబుతామన్నారు. అయినా ఇక్కడ ఇప్పుడు రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లేదని, అది ఎప్పుడో ఏపీకి వెళ్లిపోయిందన్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని... బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోల్చి చూద్దామని, తాము చేసినటువంటి అభివృద్ధి అక్కడ కనిపిస్తే రేపే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అలాగే ఎందులోనైనా అక్రమాలు జరిగాయని నిరూపిస్తే తాను పదవులు వదులుకోవడానికి సిద్ధమని చెప్పారు. తమ పార్టీ నాయకుడు గల్లీలో పుట్టి ముఖ్యమంత్రి అయ్యారని, నిర్ణయాలు తీసుకునే ధైర్యం, తెగువ ఉన్నాయన్నారు. కానీ ప్రతిపక్షాలకు మేనిఫెస్టో, బీఫామ్, హామీలు, పైల్ పై సంతకం.. ఇలా ఏం కావాలన్నా ఢిల్లీకి వెళ్లాలని ఎద్దేవా చేశారు. చివరకు బాత్రూంకు వెళ్లాలన్నా చలో ఢిల్లీ అంటారేమో అన్నారు. మీ బాస్ ఢిల్లీలో ఉంటే, మా బాస్ గల్లీలో ఉన్నారన్నారు. అయినా కంటెంట్ లేని కాంగ్రెస్‌కు, కమిట్మెంట్ కలిగిన కేసీఆర్‌కు పోలిక ఎక్కడ? అన్నారు. 

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చామని చెప్పడంపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వాళ్ళు తాము భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లామంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణకూ వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం మంత్రసాని పాత్ర పోషించిందన్నారు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలని, రేవంత్ రెడ్డి స్వయంగా సోనియా గాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత సోనియా అని టీపీసీసీ చీఫ్ గతంలో అన్నారని చెప్పారు. మీ అధ్యక్షుడే ఆ మాటలు అంటే మీరు వ్యతిరేకిస్తారా? సమర్థిస్తారా? అన్నారు.

తెలంగాణ పైసలతో భావిభారత నిర్మాణం జరుగుతోందని, ఇది మనందరికీ గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధికి దోహదపడుతున్నందుకు సెల్యూట్ తెలంగాణ.. థ్యాంక్యూ తెలంగాణ అని అనాలని చెప్పారు.

ప్రతిపక్షాలకు పలు చురకలు

ప్రసంగం సమయంలో కేటీఆర్ పలుమార్లు ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. సీతక్కను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, ఈ వ్యాఖ్యలపై మల్లు భట్టి, శ్రీధర్ బాబు అలా చెప్పలేదని వ్యాఖ్యానించడాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ.. సీతక్క సీఎం కావడం మీకు ఇష్టం లేదా? మీ పార్టీలో మీ వాళ్లు మీవాళ్లే కొట్టుకుంటారని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సమావేశాలు 30 రోజులు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు కోరుతారని, కానీ ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో రోజే సభకు రాలేదన్నారు. ఇది వారికి ఉన్న చిత్తశుద్ధి అని చురకలు అంటించారు.

మరో సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ.. శ్రీధర్ బాబు తనను గిల్లాడు కాబట్టి చెప్పక తప్పడం లేదని, 1956లో బలవంతంగా తెలంగాణను కలిపేశారని, 1969లో తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపారని, 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పి వెయ్యి మంది చావుకు కారణమయ్యారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మళ్లీ సిగ్గులేకుండా తెలంగాణ తెచ్చామని చెబుతున్నారని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News