IRCTC: ఐఆర్‌సీటీసీపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఫిషింగ్‌ స్పామ్‌తో జాగ్రత్త!

  • ఐఆర్‌‌సీటీసీ యాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు
  • నకిలీ లింకులను సర్క్యులేట్ చేస్తున్న వైనం
  • ‘ఐఆర్‌‌సీటీసీ రైల్ కనెక్ట్‌’ అనే ఫేక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా స్కెచ్
  • అలాంటి వారి వలలో పడకండంటూ ఐఆర్‌‌సీటీసీ హెచ్చరిక
beware of phishing scam irctc issues urgent warning against fake mobile app targeting users


ఐఆర్‌‌సీటీసీపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఐఆర్‌‌సీటీసీ యాప్‌ వినియోగించే వారినే లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసానికి తెరలేపారు. పెద్ద ఎత్తున ఫిషింగ్ లింక్స్‌ను షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు భారతీయ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది.

‘‘సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులను సర్క్యులేట్ చేస్తున్నారు. వాటి సాయంతో ‘ఐఆర్‌‌సీటీసీ రైల్ కనెక్ట్‌’ అనే ఫేక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటి వారి వలలో పడకండి” అని ఐఆర్‌‌సీటీసీ సూచించింది. ఐఆర్‌‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పింది. లేదా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి ఐఆర్‌‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్‌‌లో తన అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది.

అనుమానాస్పద లింకులు కనిపిస్తే క్లిక్ చేయొద్దని యూజర్లను ఐఆర్‌‌సీటీసీ హెచ్చరించింది. ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకే నేరగాళ్లు నకిలీ యాప్‌లతో వల వేస్తుంటారని చెప్పింది. ఫేక్ యాప్ అని తెలియక చాలా మంది తమ వివరాలను పొందుపరచి ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పింది. 
రోజూ లక్షలాది మంది రైలు టికెట్ల కోసం ఐఆర్‌‌సీటీసీ యాప్‌ను సందర్శిస్తుంటారు. అందులోనే డబ్బు చెల్లించి, టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. దీంతో సైబర్‌‌ నేరగాళ్లు ఐఆర్‌‌సీటీసీ యాప్‌ను టార్గెట్‌ చేశారు.

More Telugu News