Online Influencer: ఫ్రీ గిఫ్టులు ఇస్తానంటూ యూట్యూబర్ ప్రకటన.. న్యూయార్క్‌లో ఎగబడ్డ జనం!

  • న్యూయార్క్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ నిర్వహిస్తానని కై సీనట్ ప్రకటన
  • అభిమానులకు ‘ప్లే స్టేషన్ 5’ గేమ్ కన్సోల్స్ ఇస్తానని వెల్లడి
  • వందలాదిగా తరలివచ్చిన జనం.. అల్లర్లు, విధ్వంసం
Riot In New York After Influencer Announces PlayStation 5 Giveaway

ఉచితంగా బహుమతులు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? అదే గేమింగ్ ఉత్పత్తులను గిఫ్టులుగా ఇస్తామంటే ఎగబడిపోరూ.. అమెరికాలో ఇదే జరిగింది. ఓ ఆన్‌లైన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ప్రకటన న్యూయార్క్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అల్లర్లు చెలరేగడంతో అదుపు చేయడం పోలీసులకు తల ప్రాణం తోకకొచ్చింది.

21 ఏళ్ల ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కై సీనట్.. మన్‌హటన్ యూనియన్ స్క్వేర్‌‌లో శుక్రవారం సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు తన ఇన్‌స్టా పేజీలో వెల్లడించారు. అభిమానులను నేరుగా కలుస్తానని, వారికి ‘ప్లే స్టేషన్ 5’ గేమ్ కన్సోల్స్ సహా పలు గిఫ్టులు ఇస్తానని ప్రకటించాడు. దీంతో మన్‌హటన్‌ పార్క్‌కు భారీగా అభిమానులు పోటెత్తారు. వందలాది మంది యువత సీనట్‌ను చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు పార్క్ వీధుల్లో అల్లర్లకు పాల్పడ్డారు. వాహనాలను అడ్డగించడం, బాటిళ్లు విసరడం, కార్లను ధ్వంసం చేయడం వంటివి చేశారు. ఈ అల్లర్లలో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సీనట్‌ను పోలీసులు వేరే చోటుకు తరలించారు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 

సీనట్‌కు విపరీతమైన పాప్యులారిటీ ఉంది. ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అతడికి 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్, ట్విట్టర్‌‌లోనూ భారీగానే ఫాలోయింగ్ ఉంది. గతేడాది ‘స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డునూ గెలుచుకున్నాడు.

More Telugu News