Anand Mahindra: చైనాకు ఒక అడుగు దూరంలోనే భారత్: ఆనంద్ మహీంద్రా

  • ప్రపంచ తయారీ కేంద్రంగా మారబోతున్నామన్న పారిశ్రామికవేత్త
  • చైనాను వెనక్కి నెట్టేసేందుకు ఎంతో దూరం లేదన్న అభిప్రాయం
  • కరోనా అనంతరం పరిస్థితులు భారత్ కు అనుకూలించినట్టు వెల్లడి
India in pole vaulting distance to oust China as worlds factory

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తయారీ సంస్థలు భారత్ వైపు అడుగులు పడేలా చేస్తున్నట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ప్రపంచానికి తయారీ కేంద్రంగా ఉన్న చైనాను పక్కకు తోసేసి ఆ స్థానాన్ని భారత్ సొంతం చేసుకునేందుకు ఒక్క పోల్ వాల్ట్ (ఒక్క జంప్) దూరంలోనే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఆనంద్ మహీంద్రా దీనిపై మాట్లాడారు.

కేవలం భౌగోళిక రాజకీయ పరమైన కారణాలు ఒక్కటే తయారీ కంపెనీలను భారత్ వైపు నడిచేలా చేయడం లేదంటూ.. ఆర్థికపరమైన కారణాలు కూడా ఇందులో ఉన్నాయని మహీంద్రా చెప్పారు. ‘‘ప్రపంచంలో అతి తక్కువ తయారీ వ్యయం అయ్యే దేశం భారత్. అందుకే ఆలస్యంగా అయినా యాపిల్, శామ్ సంగ్, బోయింగ్, తోషిబా వంటి సంస్థలు తమ తయారీలో అధిక భాగాన్ని భారత్ కు మార్చుకున్నాయి. 

ఇక కేవలం పాశ్చాత్య దేశాలే ఈ పని చేయడం లేదు. భారత్ లో రెండో అతిపెద్ద ఇన్వెస్టర్ సింగపూర్ అని చెబితే అది ఆశ్చర్యం వేయక మానదు’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కరోనా అనంతరం సరఫరా వ్యవస్థలో ఏర్పడిన ఇబ్బందులు, చైనా ఆకాంక్షలపై సందేహాలు కూడా భారత్ కు అనుకూలించినట్టు ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 

More Telugu News