Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

  • వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రామజన్మభూమి  
  • ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్న ట్రస్ట్ సభ్యులు
  • వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను ఆహ్వానిస్తామని వెల్లడి
Ram Temple Consecration Ceremony From January 21 To 23

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి శుభముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. 

'వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించ డం జరిగింది. ఈ వేడుకకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. దీనికి ప్రముఖ సాధువులు, ఇతర ప్రముఖులూ హాజరవుతారు' అని రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పీటీఐకి తెలిపారు.

ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామని, వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి వేదిక లేదా బహిరంగ సభ ఉండవన్నారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దల్ని ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోందన్నారు. అలాంటి సాధువుల జాబితాను ట్రస్ట్ సిద్ధం చేస్తోందని, త్వరలో వారికి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకంతో ఆహ్వాన పత్రాన్ని పంపించనున్నట్లు చెప్పారు.

అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ 25,000 మంది సాధువులు, 10,000 మంది ప్రత్యేక అతిథులు విడివిడిగా ఉంటారని చెప్పారు. వీరంతా రామజన్మభూమి ప్రాంగణంలోని పవిత్రోత్సవానికి హాజరవుతారన్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాల కారణంగా ఆలయానికి భూమి పూజ కార్యక్రమం ఆగస్ట్ 5, 2020న చాలా చిన్నగా జరిగిందన్నారు. రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుందన్నారు.

More Telugu News