Chandrababu: మొన్న పులివెందుల... ఇప్పుడు పుంగనూరు గడ్డపై గర్జిస్తున్నా: పెద్దిరెడ్డికి చంద్రబాబు సవాల్

  • చంద్రబాబు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తం
  • చంద్రబాబు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నాలు
  • పుంగనూరు బైపాస్ కూడలి వద్దకు చేరుకున్న చంద్రబాబు
  • ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
Chandrababu challenges minister Peddireddy

తీవ్ర ఉద్రిక్తతల నడుమ టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరు బైపాస్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు జయజయధ్వానాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. కార్యకర్తల ఉత్సాహంతో చంద్రబాబు సమర నినాదం చేశారు. 

"నేను పుంగనూరు రోడ్డుపై తిరగకూడదా? పుంగనూరు రోడ్డు మీ తాత జాగీరా? ప్రజలు తిరగబడితే మీరు పారిపోతారు" అంటూ మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరించారు. "నెత్తురోడుతున్నా నిలబడిన కార్యకర్తలను అభినందిస్తున్నా. మీ నుంచి కారిన ప్రతి రక్తపు చుక్క నా నుంచి కారినట్టే. చల్లా బాబుపై దెబ్బ పడితే నాపై పడినట్టే" అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. 

"మొన్ననే పులివెందులలో పొలికేక వినిపించా... ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నా. అధికార పార్టీకి దాసోహం కావొద్దని పోలీసులను కోరుతున్నా. ఇవాళ్టి ఘటనలకు ఎస్పీనే బాధ్యుడు, నేటి దాడి ఘటనపై విచారణ జరపాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

కాగా, పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన కార్యకర్తలను చంద్రబాబు తన వాహనంపైకి పిలిపించుకున్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. నేను మళ్లీ పుంగనూరు వస్తా... పుంగనూరు పట్టణమంతా పర్యటిస్తా అంటూ మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు. ఇవాళ్టి విధ్వంసానికి కారణం పెద్దిరెడ్డేనని ఆరోపించారు. ఈ విధ్వంసంలో పోలీసు యంత్రాంగం పాత్ర కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News