Chidambaram: ఆ బిల్లులో ఏం మెరిట్స్ కనిపించాయి?: వైసీపీ, బీజేడీలపై చిదంబరం విమర్శలు

  • ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయన్న చిదంబరం
  • బిల్లు పాస్ అయితే అధికారులు సుపీరియర్లు, మంత్రులు సబార్డినేట్లు అవుతారనే విషయం వారికి తెలుసా? అని ప్రశ్న
  • సీఎం లేకపోయినా అథారిటీలోని అధికారులు నిర్ణయాలను తీసుకోవడాన్ని వీరు మెటిట్ గా భావిస్తున్నారా? అని మండిపాటు
Chidambaram fires on Jagan over Delhi Services Authority Bill

ఏపీ అధికార పార్టీ వైసీపీ, ఒడిశా అధికార పార్టీ బీజేడీలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సర్వీసెస్ అథారిటీ బిల్లు (ఢిల్లీ ఆర్డినెస్స్ బిల్లు)కు వైసీపీ, బిజూ జనతాదళ్ ఎందుకు మద్దతు ప్రకటించాయని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు వల్ల జరిగే నష్టాన్ని అర్థం చేసుకోవడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే జరిగే అనర్థాన్ని అవి పట్టించుకోవడం లేదని చెప్పారు. 

ఈ బిల్లుకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలుకుతున్నారనే విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని... కానీ ఈ బిల్లులో ఏ మెరిట్స్ ను వైసీపీ, బీజేడీ గుర్తించాయో తనకు అర్థం కావడం లేదని చిదంబరం దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నియమించే త్రిసభ్య అథారిటీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేవలం ఒకరు మాత్రమేనని, మిగిలిన ఇద్దరు కేంద్రం నియమించే అధికారులు ఉంటారని... ఈ విషయాన్ని వైసీపీ, జేడీయూ మెరిట్ గా భావించాయా? అని ప్రశ్నించారు. కేంద్రం నియమించే ఇద్దరు అధికారులే కోరంను నిర్ణయిస్తారని... కోరం ప్రకారం సమావేశాల్లో ముఖ్యమంత్రి లేకుండానే ఈ ఇద్దరు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రిని కూడా కాదని ఇద్దరు అధికారులు నిర్ణయాలను తీసుకోవడాన్ని మెరిట్ గా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

అథారిటీ ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలను కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించేలా బిల్లు ఉందని... దీన్ని వీరు మెరిట్ గా భావిస్తున్నారా? అని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలను అధికారులు పాటించాలా? వద్దా? అనే అంశాన్ని కూడా నియంత్రించే అధికారాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లడాన్ని మెరిట్ గా భావిస్తున్నారా? అని నిలదీశారు. ఈ బిల్లు పాస్ అయితే అధికారులు సుపీరియర్ అవుతారని, మంత్రులు వారికి సబార్డినేట్లు అవుతారనే విషయం ఈ రెండు పార్టీలకు తెలుసా? అని చిదంబరం మండిపడ్డారు.

More Telugu News