Manipur: మణిపూర్ లో 3 నెలల్లో 30 మంది మిస్సింగ్

  • బతికున్నారో.. చనిపోయారో తెలియదని రోదిస్తున్న బాధితులు
  • కోచింగ్ క్లాసులకు వెళ్లి తిరిగి రాలేదని ఓ విద్యార్థి కుటుంబం ఆవేదన
  • కుటుంబాన్ని పోషించే కొడుకు కనిపించకుండా పోయాడని మరో తల్లి కన్నీరు
30 people went Missing In 3 Months In Manipur

కోచింగ్ క్లాసులకు వెళ్లిన స్టూడెంట్ ఇంటికి తిరిగి రాలేదు.. ఉదయం ఎప్పట్లాగే పనికి వెళ్లిన వ్యక్తి సాయంత్రం ఇంటికి చేరుకోలేదు.. విధుల్లో భాగంగా రోడ్డెక్కిన ఓ జర్నలిస్టు ఏమైపోయాడో తెలియదు.. ఇలా ఒకరిద్దరు కాదు, మూడు నెలల్లో 30 మంది కనిపించకుండా పోయారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో జరిగిన ఘోరాలివి. మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలలో చోటుచేసుకున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతోమంది కనిపించకుండా పోయారని, వారంతా ఏమయ్యారో తెలియదని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని బాధితులు చెబుతున్నారు.

అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 6 వేల జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయినట్లు అధికార వర్గాల సమాచారం. కుటుంబానికి ఆధారమైన కొడుకు కనిపించకుండా పోవడంతో దిక్కులేనివారమయ్యామంటూ ఓ జర్నలిస్టు తల్లి వాపోయారు. రెండు నెలల క్రితం స్నేహితుడితో కలిసి వెళ్లిన జర్నలిస్ట్ ఆటమ్ సమరేంద్ర సింగ్ ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పటికీ అతని ఆచూకీ గుర్తించలేకపోయామని పోలీసులు చెప్పారు.

నీట్ కోచింగ్ క్లాసులకు వెళ్లిన పదిహేడేళ్ల కూతురు ఇంటికి తిరిగిరాలేదని ఆమె తల్లి వాపోయింది. జులై 6న బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లిందని, సాయంత్రం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశానని చెప్పింది. ఎక్కడున్నావని అడిగితే నంబోల్ లో ఉన్నట్లు భయపడుతూ చెప్పిందని, అక్కడేం చేస్తున్నావని అడుగుతుండగానే ఫోన్ కట్ అయిందని వివరించింది. దీంతో భయాందోళనలకు గురై పోలీసులను ఆశ్రయించామని ఆ తల్లి తెలిపారు. 

తన కూతురు బాయ్ ఫ్రెండ్ తో కలిసి బైక్ పై నంబోల్ వెళ్లినట్లు ఓ సీసీటీవీ ఫుటేజీలో రికార్డైందని పోలీసులు చెప్పారన్నారు. ఆపై తన కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం సాధ్యం కావడంలేదని, ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదని వాపోయారు. బాధితురాలితో పాటు వెళ్లిన యువకుడు కూడా కనిపించకుండా పోయాడని, అతడి ఫోన్ లో వేరే సిమ్ వేసి వాడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. 

ఇంఫాల్ వ్యాలీ మెయిన్ రోడ్ కు పది కిలోమీటర్ల దూరంలోని టిడ్డిమ్ రోడ్ లో ఆ ఫోన్ లొకేషన్ ను పోలీసులు గుర్తించారు.. అయితే, అక్కడికి వెళ్లేందుకు పోలీసులు భయపడుతున్నారని బాధిత యువతి తల్లి చెప్పారు. మరోవైపు, అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలు ఇంఫాల్ లోని వివిధ ఆసుపత్రుల మార్చురీల్లో ఉన్నాయని, వాటిని సామూహిక ఖననం చేసేందుకు అనుమతివ్వాలని అధికారులను కోరినట్లు ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ నేతలు చెబుతున్నారు.

More Telugu News