Gold: బంగారానికి తగ్గుతున్న డిమాండ్.. పెరిగిన ధరలే కారణం!

  • ప్రపంచవ్యాప్తంగా తగ్గిన డిమాండ్
  • ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏడు శాతం తగ్గిన డిమాండ్
  • 8 శాతం క్షీణించిన ఆభరణాల డిమాండ్
Gold Demand Declining

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ సహా ప్రపంచ దేశాల్లో పసిడికి డిమాండ్ బాగా తగ్గినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తెలిపింది. దేశీయంగా మొదటి త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ 7 శాతానికి తగ్గి 158.1 టన్నులకు క్షీణించినట్టు పేర్కొంది. నిరుడు ఇదే సమయంలో బంగారం డిమాండ్ 170.7 టన్నులుగా ఉండడం గమనార్హం. అయితే, అదే సమయంలో బంగారం దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులకు చేరుకున్నాయి. 

ఇటీవలి కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ఒక దశలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 64 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. అయితే, ధర పెరగడంతో బంగారం విలువ పరంగా డిమాండ్ నాలుగుశాతం పెరిగి రూ. 82,530 కోట్లకు చేరుకుంది. నిరుడు ఇదే త్రైమాసికంలో అది రూ. 79.270 కోట్లుగా ఉంది. 

ఆభరణాల డిమాండ్ కూడా 8 శాతం క్షీణించినట్టు గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అయితే, 18 క్యారెట్ల బంగారు ఆభరణాల డిమాండ్ మాత్రం పెరుగుతోంది. బంగారం కడ్డీలు, నాణేల డిమాండ్ కూడా స్వల్పంగా తగ్గి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు పడింది. బంగారానికి డిమాండ్ తగ్గడం వెనక పెరుగుతున్న ధరలు కూడా ఒక కారణం కావొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News