Telangana: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

Minister koppula Eshwar petition not considered by telangana high court
  • కొప్పుల ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్
  • ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టేయాలంటూ మంత్రి మధ్యంతర పిటిషన్
  • తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు.. విచారణ రేపటికి వాయిదా
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

2018లో జరిగిన ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ (టీఆర్ఎస్) తరఫున పోటీచేసిన కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆయనపై కాంగ్రెస్ టికెట్ తో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతులతో గెలిచారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు.

దీనిపై ఆయన కోర్టుకెక్కారు. కొప్పుల ఎన్నిక చెల్లదని, తననే ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్ దాఖలు చేయగా.. మంత్రి పిటిషన్ ను హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది.
Telangana
BRS
Koppula Eshwar
2018 elections
Election result
adluri laxman

More Telugu News