Kapil Dev: నేనే బోర్డ్ ప్రెసిడెంట్ అయ్యుంటే..: బీసీసీఐపై కపిల్ దేవ్ ఫైర్

  • ప్రపంచకప్ షెడ్యూల్ పై విమర్శలు గుప్పించిన కపిల్ దేవ్
  • మన ఆటగాళ్లు సుదీర్ఘ ప్రయాణాలు చేసేలా వేదికలు ఉన్నాయని మండిపాటు
  • తాను బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యుంటే.. వారికి చార్టెర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేసేవాడినని వ్యాఖ్య
Kapil Dev fires on BCCI about ODI World Cup fixtures

వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్టేలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్డే ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో లేనిపోని ప్రయోగాలు చేస్తున్నారంటూ సీనియర్లు మండిపడుతున్నారు. రెండో వన్టేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పూర్తిగా విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రయోగాలు ఈ సమయంలో ఎందుకని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. 

మరోవైపు బీసీసీఐని ఉద్దేశించిన భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో జరగబోతున్న ప్రపంచకప్ కు బీసీసీఐ సన్నద్ధం అవుతున్న తీరును ఆయన తప్పుపట్టారు. మన జట్టు మంచిగా రాణిస్తున్నంత కాలం మిమ్మల్ని బెస్ట్ బోర్డ్ అంటారని... అందులో తప్పేమీ లేదని అన్నారు. అయితే, మంచి బోర్డు కూడా మరింత ఇంప్రూవ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. 

ప్రపంచ కప్ ఫిక్స్చర్ (షెడ్యూల్) చూస్తే తనకు చాలా ఆశ్చర్యకరంగా ఉందని కపిల్ అన్నారు. ఈ షెడ్యూల్ ను ఎవరు తయారు చేశారని ప్రశ్నించారు. ప్రపంచకప్ లో ఇండియా 11 మ్యాచ్ లను ఆడబోతోందని... వివిధ వేదికలకు ఆటగాళ్లు ప్రయాణించాల్సిన సమయం వారిని తీవ్ర అలసటకు గురి చేసేలా ఉందని చెప్పారు. 

మ్యాచ్ లు ఆడటం కోసం మన ఆటగాళ్లు ధర్మశాలకు, అక్కడి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి కోల్ కతాకు... ఇలా ఈ చివరి నుంచి, ఆ చివరకు సుదీర్ఘ ప్రయాణాలు చేసేలా షెడ్యూల్ ఉందని కపిల్ విమర్శించారు. మన దేశంలో ప్రపంచ కప్ జరుగుతున్నప్పుడు మన ఆటగాళ్ల మంచి, చెడ్డలను పట్టించుకునే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. 

తానే బీసీసీఐ ప్రెసిడెంట్ అయి ఉంటే మన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్ ఫ్లయిట్ ను సమకూర్చేవాడినని కపిల్ చెప్పారు. మైదానంలో వారు పూర్తి స్థాయిలో ప్రదర్శన కనపరిచేందుకు తాను అన్నీ చేసేవాడినని తెలిపారు. ఇలాంటి విషయాలను బోర్డ్ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 

మరోవైపు, అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ జరగబోతోంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి మ్యాచ్ ను ఆడబోతున్నాయి. ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడుతుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

More Telugu News