HR Manager: డబ్బు కోసం అతి తెలివి.. పేరోల్‌లో భార్య పేరును చేర్చి సంస్థను పదేళ్లపాటు మోసగించిన హెచ్ఆర్ మేనేజర్

Man Puts Unemployed Wife On Payroll For 10 Years
  • ఢిల్లీలోని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వీస్ సంస్థలో ఘటన
  • అసిస్టెంట్ మేనేజర్‌గా చేరి మేనేజర్ స్థాయికి ఎదిగిన నిందితుడు
  • పదేళ్లపాటు దాదాపు రూ. 4 కోట్ల బదలాయింపు
  • ఆ డబ్బుతో ఆస్తుల కొనుగోలు
తనకొస్తున్న జీతం డబ్బులతో సంతృప్తి పడని ఓ హెచ్ఆర్ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థను పదేళ్లపాటు మోసం చేశాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రాధా వల్లభ్‌నాథ్ అనే వ్యక్తి 2008లో అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. అయితే, తనకొస్తున్న జీతంతో సంతృప్తి చెందని రాధా వల్లభ్ ఇంట్లో ఉండే తన భార్య పేరును కంపెనీ పేరోల్‌లో చేర్చాడు. ఫలితంగా ప్రతి నెల ఆమె ఖాతాలో జీతం డబ్బులు పడేవి. ఇలా పదేళ్లపాటు దాదాపు సంస్థకు దాదాపు రూ. 4 కోట్ల మేర నష్టం కలిగించాడు. 

నెలవారీ జీతాలకు సంబంధించి జాబితా సిద్ధమైన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తన భార్య పేరును చేర్చి హెచ్ఆర్ చీఫ్‌కు పంపేవాడు. అక్కడ అనుమతి పొందిన తర్వాత పేరోల్ వెండర్‌కు పంపేవాడు. ఇలా  2012 నుంచి అక్రమంగా దాదాపు రూ. 3.6 కోట్ల నగదును తన భార్య ఖాతాకు బదిలీ చేసినట్టు సంస్థ ఆరోపిస్తోంది. 

ఆ సొమ్ముతో అతడు ఢిల్లీ, జైపూర్‌తోపాటు ఆయన స్వస్థలమైన ఒడిశాలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. మ్యూచువల్ ఫండ్స్‌లోనే భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సంస్థ ఆరోపించింది. ఉద్యోగి మోసాన్ని గుర్తించిన సంస్థ అతడిని నిరుడు డిసెంబరులో ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాలతో నిందితుడి నేరాలపై పూర్తిస్థాయి దర్యాప్తునకు పోలీసులు నడుం బిగించారు.
HR Manager
Delhi
Payroll
ManpowerGroup Service Private Limited

More Telugu News