SRH: ప్రక్షాళన దిశగా సన్ రైజర్స్ హైదరాబాద్... పలువురిపై వేటుకు రంగం సిద్ధం!

  • గత కొన్ని సీజన్లుగా తీసికట్టుగా మారిన  సన్ రైజర్స్ ఆటతీరు 
  • అభిమానుల్లో ఆదరణ కోల్పోతున్న ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు
  • కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు తేలిపోతున్న వైనం
  • కోచ్ గా బ్రియాన్ లారా పనితీరుపై తీవ్ర విమర్శలు
SRH eyes on revamp the team for upcoming season

గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు కొన్ని సీజన్లుగా దిగజారుతోంది. ఏ మ్యాచ్ గెలుస్తారో, ఏ మ్యాచ్ లో ఓడిపోతారో అన్నట్టుగా తయారైన సన్ రైజర్స్ పై అభిమానుల్లో అంచనాలు కూడా అంతకంతకు తగ్గుతున్నాయి. కెప్టెన్లను మార్చినా ఫలితం శూన్యం.

వేలం సందర్భంగా ఎంతో పొదుపుగా డబ్బు ఖర్చు పెడుతుందని సన్ రైజర్స్ కు పేరుంది. సరైన ఆల్ రౌండర్లను కొనుగోలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ లో కష్టాలు తప్పడంలేదని విమర్శకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. 

గత సీజన్ లో రూ.13.25 కోట్లతో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసినా, అతడేమీ ఆల్ రౌండర్ కాడు. ఆడిన మ్యాచ్ ల్లో ఒక్క సెంచరీ తప్ప మిగతా మ్యాచ్ ల్లో అతడు తుస్సుమన్నదే ఎక్కువ. ఆ సెంచరీ కూడా లైఫ్ లభించడంతో చేశాడు. 

హ్యారీ బ్రూక్ ఒక్కడే కాదు, జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లు కొందరిని వదిలించుకునేందుకు సన్ రైజర్స్ యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాంటి ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ (రూ.8 కోట్లు) కూడా ఉన్నారు. 

2023 సీజన్ లో వాషింగ్టన్ సుందర్ ఒకట్రెండు మ్యాచ్ ల్లో ఆడి, ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. సూపర్ పేస్ తో అదరగొడతాడనుకుంటే, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ ను ప్రత్యర్థి బ్యాటర్లు తుక్కు కింద కొట్టారు. దాంతో అతడి వల్ల సన్ రైజర్స్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. ఈ సీజన్ లో ఉమ్రాన్ మాలిక్ 8 మ్యాచ్ ల్లో తీసింది 5 వికెట్లే. అతడి ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో ఆ గణాంకాలే చెబుతాయి. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.

ఈ ఏడాది డిసెంబరులో ఐపీఎల్ మినీ వేలం నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దాంతో, ఆ లోపే పలువురు ఆటగాళ్లను సాగనంపాలన్నది సన్ రైజర్స్ యాజమాన్యం ప్రణాళికగా తెలుస్తోంది. 

అన్నిటికంటే ముఖ్యమైన విషయం... ఏ జట్టుకైనా కోచ్ అత్యంత ముఖ్యుడు. జట్టును గెలుపు దిశగా పక్కా వ్యూహాలతో నడిపించాల్సిన బాధ్యత కోచ్ పై ఉంటుంది. ఆ లెక్కన చూస్తే సన్ రైజర్స్ కోచ్ గా బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా ఘోరాతిఘోరంగా విఫలమైనట్టే. అందుకే, ప్రక్షాళనలో భాగంగా మొదటి వేటు లారాపైనే పడుతుందని భావిస్తున్నారు.

More Telugu News