tomato: రూ.20 లక్షల విలువైన టమాటా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు మాయం!

  • కోలార్ నుండి జైపూర్ వెళ్తున్న ట్రక్కు
  • భోపాల్ టోల్ గేట్ దాటిన తర్వాత పని చేయని డ్రైవర్ మొబైల్
  • కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
Mysterious disappearance of Rs 20 lakh worth tomato cargo raises concerns among traders

కర్ణాటకలోని కోలార్ ఏపీఎంసీ యార్డ్ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు రూ.20 లక్షల విలువైన టమాటా లోడ్‌తో వెళ్తోన్న ట్రక్ కనిపించకుండా పోయింది. ఈ మేరకు ట్రక్కు యజమానులు కోలార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్రక్కు శనివారం రాత్రి జైపూర్ చేరుకోవాల్సినప్పటికీ, అక్కడకు వెళ్లలేదు. డ్రైవర్ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి.  

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... కోలార్‌లో ఉన్న ఎస్వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుండి 11 టన్నుల టమాటా లోడుతో ట్రక్కు జైపూర్‌కు బయలుదేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ టోల్ గేట్ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. ఆదివారం ఉదయం ట్రక్కు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా, నెంబర్ అందుబాటులో లేదని వచ్చింది. ట్రక్కు క్లీనర్ వద్ద మొబైల్ ఫోన్ లేదు. లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ నుండి కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో మునిరెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. ట్రక్కు కోలార్ నుండి సుమారు 1,600 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత జాడ లేకుండా పోయింది. 

వాహనం ప్రమాదానికి గురైందా? ట్రక్కును హైజాక్ చేసి, దొంగిలించారా? మొబైల్ నెట్ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫోన్ కలవడం లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ట్రక్కు కనిపించకుండా పోవడంపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టమాటా ధరలు అత్యధికంగా పలుకుతున్న ఈ సమయంలో ఆ ట్రక్కులో రూ.20 లక్షలకు పైగా టమాటా ఉంది.

More Telugu News