Pruthvi: అంబటి రాంబాబు క్యారెక్టర్ చేయాల్సిన అవసరం నాకు లేదు: మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన పృథ్వీ

  • 'బ్రో' సినిమాలో తన క్యారెక్టర్ కు మంచి స్పందన వచ్చిందన్న పృథ్వీ
  • ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదని వ్యాఖ్య
  • నిర్మాత మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని వెల్లడి
No need for me to play Ambati Rambabu role says actor Pruthvi

వపన్ కల్యాణ్ తాజా చిత్రం 'బ్రో' అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్ వివాదాస్పదమయింది. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా విమర్శలు గుప్పించారు. అదే స్థాయిలో అంబటికి పృథ్వీ కౌంటర్ ఇచ్చారు. అవకాశమిస్తే సత్తెనపల్లిలో అంబటిని ఓడిస్తానని ఆయన అన్నారు. 


మరోవైపు ఈరోజు హైదరాబాద్ లో 'బ్రో' సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ... "పృథ్వీగారు ఎందుకండీ మీ క్యారెక్టర్ ఇంత వైరల్ అయింది? అని సముద్రఖని గారు నన్ను అడిగారు. దీనికి సమాధానంగా సినిమాలో మంచి ఉందని, హ్యూమన్ వాల్యూస్, ఎమోషన్స్ ఉన్నాయని చెప్పాను. ఎంత సంపాదించినా చివరకు మట్టిలోకే వెళ్లాలని చెప్పిన పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని అన్నాను. అయినా నేను పోషించిన శ్యాంబాబు పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు" అని చెప్పారు. 

ఏంటండీ మీ సినిమాలో ఏపీ మంత్రిని కించపరిచేలా చేశారట అని కొందరు తనతో అన్నారని... ఆ మంత్రి అంబటి రాంబాబు అని చెప్పారని... వెంటనే తాను అంబటి రాంబాబు ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చానని పృథ్వీ అన్నారు. తెలియని వాడి గురించి సినిమాలో తానెందుకు చేస్తానని చెప్పానని తెలిపారు. 

ఈ సినిమాలో తనది ఒక బాధ్యత లేని పనికిమాలిన వెధవ క్యారెక్టర్ అని... బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చెప్పారు. దర్శకుడు సముద్రఖని చెప్పిన క్యారెక్టర్ కు తాను న్యాయం చేశానని... అంబటి రాంబాబు క్యారెక్టర్ కు న్యాయం చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తన పాత్ర గురించే టాక్ నడుస్తోందని చెప్పారు. మధ్యలో సినిమాలు వదిలి బయటకు వెళ్లిన తాను... మళ్లీ వచ్చి చేసిన సినిమా ఇదని చెప్పారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈ సినిమాలో తనకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిపారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News