Coimbatore Court: ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోయంబత్తూర్ కోర్టు.. ఆయన చేసిన నేరం ఏమిటంటే..?

  • ఆర్టీసీ బస్సుల వేలంలో అక్రమాల కేసు
  • నకిలీ పత్రాలతో 47 బస్సుల విక్రయం
  • 1988 నుంచి కొనసాగుతున్న కేసు విచారణ
Coimbatore court sentenced a man to 383 years in prison

నకిలీ పత్రాలను సృష్టించి, మోసం చేసిన కేసులో తమిళనాడులోని కోయంబత్తూర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మోసానికి పాల్పడిన వ్యక్తికి 383 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.  

కేసు వివరాల్లోకి వెళ్తే... ఇది 1988 నాటి కేసు. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబర్ 9న ఫిర్యాదు నమోదయింది. నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతి చెందారు. 

మరోవైపు, బతికున్న వారిలో కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురునీ జడ్జి నిర్దోషులుగా పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు. దీంతో, ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో కోదండపాణిని పోలీసులు జైలుకు తరలించారు.

More Telugu News