Twitter: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... విధివిధానాలు ఇవిగో!

  • గతంలోనే క్రియేటర్లకు స్వాగతం పలికిన ఎలాన్ మస్క్
  • యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్
  • రెవెన్యూ షేరింగ్ విధానం తీసుకువచ్చిన ట్విట్టర్
How Twitter users earn revenue

యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు. 

ఈ యాడ్ రెవెన్యూ విధానం ఎలా ఉంటుందంటే... వెరిఫైడ్ యూజర్లు ట్విట్టర్ లో చేసే పోస్టులకు వచ్చే రిప్లయ్స్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలను ప్రదర్శిస్తారు. ఇలాంటి పోస్టులకు వచ్చే ఇంప్రెషన్స్ సంఖ్య ఆధారంగా యూజర్లు ఆదాయం ఆధారపడి ఉంటుంది. 

దీనికి సంబంధించిన విధివిధానాలను ట్విట్టర్ నూతన యాజమాన్యం తెరపైకి తెచ్చింది. ట్విట్టర్ ద్వారా నేరుగా ఆదాయం పొందవచ్చంటూ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ క్రియేటర్లకు ఆహ్వానం పలుకుతున్నారు.


అర్హత ఇలా...

రెవెన్యూ యాడ్ షేరింగ్ విధానం ద్వారా ఆదాయం పొందాలనుకునేవారు తప్పనిసరిగా ట్విట్టర్ బ్లూ టిక్, లేదా ఇతర వెరిఫైడ్ యూజర్లు అయ్యుండాలి. గడచిన 3 నెలల వ్యవధిలో తమ పోస్టులకు కనీసం 15 మిలియన్ల ఇంప్రెషన్లు పొంది ఉండాలి. దాంతో పాటే సదరు యూజర్ కు కనీసం 500 మంది ఫాలోవర్లు ఉండాలి.

పేమెంట్లు పొందాలంటే స్ట్రైప్ తప్పనిసరి

ట్విట్టర్ తన రెవెన్యూ షేరింగ్ విధానంలో యూజర్లకు చెల్లింపులు చేసేందుకు స్ర్రైప్ ప్లాట్ ఫాంను వినియోగిస్తోంది. అందుకే యూజర్లు స్ట్రైప్ ప్లాట్ ఫాంలోనూ ఓ ఖాతా కలిగి ఉండాలి. ముఖ్యంగా, ఈ యాడ్ రెవెన్యూ షేరింగ్ విధానంలో ట్విట్టర్ Terms and Policies ను తప్పనిసరిగా అంగీకరించాల్సి ఉంటుంది. యూజర్లు తమ అకౌంట్ లో కనీసం 50 డాలర్లు చేరిన తర్వాతే వారు చెల్లింపులకు అర్హులవుతారు. 

పేమెంట్ సెట్టింగ్ ఇలా...

ట్విట్టర్ బ్లూ టిక్ యూజర్లు తమ అకౌంట్ మెనూలో మోర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మోనిటైజేషన్ అనే ఫీచర్ ప్రత్యక్షమవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు యాడ్ రెవెన్యూ షేరింగ్ కు అర్హులో, కాదో తెలిసిపోతుంది. ఒకవేళ మోనిటైజేషన్ కు మీరు అర్హులైతే... జాయిన్ అండ్ సెటప్ పే ఔట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ట్విట్టర్ స్ట్రైప్ ప్లాట్ ఫాం ద్వారా యూజర్ల బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు చేస్తుంది.

More Telugu News