Dil Raju: నేను ఎన్నికల్లో పోటీ చేయడం మా ఇంట్లో ఇష్టం లేదు... కానీ!: దిల్ రాజు

Dil Raju press meet ahead of Telugu Film Chamber Of Commerce elections tomorrow
  • రేపు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు
  • తన ప్యానెల్ తో మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు
  • సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాను పోటీ చేస్తున్నట్టు వెల్లడి
  • ఇండస్ట్రీలో ఐక్యత చాలా ముఖ్యమని దిల్ రాజు ఉద్ఘాటన
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రేపు (జులై 30) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దిల్ రాజు తన ప్యానెల్ తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఇంట్లో కానీ, తన ఆఫీసులో వాళ్లకి కానీ ఇష్టం లేదని అన్నారు. అయితే, సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తాను బరిలో దిగుతున్నానని, సభ్యుల కోసమే తాను ఎన్నికల్లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. 

తాము గెలిస్తే ఫిల్మ్ చాంబర్ ను మరింత బలోపేతం చేస్తామని దిల్ రాజు తెలిపారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునేవాళ్లు దిల్ రాజు కావాలో, వద్దో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తన ప్యానెల్ మంచి ఆలోచనలతో ఎన్నికల బరిలో దిగిందని పేర్కొన్నారు. 

"సినీ రంగంలో ప్రధానంగా నాలుగు విభాగాల్లో సమస్యలను గుర్తించాం. నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ కు కష్టాలు పెరిగాయి. ఫిల్మ్ చాంబర్ రాజ్యాంగంలో మార్పులు జరగాలని కోరుకుంటున్నాం. 50 ఏళ్ల నాటి బైలాస్ ను మార్చాల్సిన అవసరం ఉంది. బైలాస్ ను మార్చితే ముందు తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 

ఒక్కొక్కరి పేరిట 10 బ్యానర్లు ఉన్నాయి... కానీ ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలని మేం భావిస్తున్నాం. చాంబర్ లో 1500 మంది సభ్యులు నమోదై ఉన్నారు... కానీ వారిలో క్రియాశీలకంగా ఉంటోంది 150 మందే. గడచిన మూడేళ్లలో సినిమాలు తీసినవారే చాంబర్ లో ఉండాలన్నది మా ప్రతిపాదన. దానికి కొందరు ఒప్పుకోవడంలేదు. మేం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేసుకోవడం వెనుక కారణం కూడా ఇదే. ఇండస్ట్రీలో ఐక్యత చాలా ముఖ్యం. అందరం కలిస్తేనే ముందుకు వెళ్లగలం" అని దిల్ రాజు స్పష్టం చేశారు. 

అంతేకాదు, తాను ఏ రాజకీయ పార్టీలో అడుగుపెట్టినా ఎంపీగా గెలిచే సత్తా ఉందని, కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తన ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. 

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి దిల్ రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

రేపు ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ కు అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. విజయంపై దిల్ రాజు, సి.కల్యాణ్ ప్యానెళ్ల సభ్యులు ఎవరికివారే విజయంపై ధీమాగా ఉన్నారు.
Dil Raju
Telugu Film Chamber Of Commerce
Elections
Tollywood

More Telugu News