Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుది ఆస్కార్ లెవల్ నటన: మంత్రి అంబటి

  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అన్నీ అబద్ధాలేనని మండిపడ్డ మంత్రి
  • కాపర్ డ్యాంలు, స్పిల్ వే నిర్మాణం పూర్తికాకుండానే డయాఫ్రం వాల్ నిర్మించారని ఆరోపణ
  • తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టుల గురించి క్షణం కూడా ఆలోచించలేదేమని ప్రశ్నించిన అంబటి
  • చంద్రబాబుకు కౌంటర్ గా మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి అంబటి రాంబాబు
AP Minister Ambati Rambabu counter to chandrababu

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చంద్రబాబు ఆస్కార్ లెవల్ లో నటించారని ఎద్దేవా చేశారు. మహానటుడని ఎన్టీఆర్ ను అంటుంటారు కానీ, తన జీవితంలో చంద్రబాబులా నటించిన వారిని ఇప్పటి వరకూ చూడలేదని మంత్రి అన్నారు. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు వచ్చిందని విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క క్షణం కూడా ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదేమని నిలదీశారు.

పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పందించారు. మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడేనాటికి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందనే వివరాలను మంత్రి అంబటి ఈ ప్రజెంటేషన్ లో వివరించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా రెండు కాపర్ డ్యాంలు, స్పిల్ వే, డయాఫ్రం వాల్ తదితర నిర్మాణాలు చేపట్టాలని గుర్తుచేశారు. కృత్రిమంగా నదిని సృష్టించాలని, దాని కోసం భూమిని తవ్వాలని చెప్పారు. ఇదంతా పూర్తిచేసి, కాపర్ డ్యాంల నిర్మాణం కూడా పూర్తయ్యాక నిర్మించాల్సిన డయాఫ్రం వాల్ ను చంద్రబాబు తొందరపడి ముందే కట్టించారని విమర్శించారు. స్పిల్ వేలో కూడా ఒక్క గేటు మాత్రమే.. అది కూడా ఇంటి నిర్మాణంలో పునాదులు లేపిన తర్వాత గుమ్మాలు పెట్టినట్లు పెట్టించారని మండిపడ్డారు. చుట్టూ వాల్ లేకుండా రెండు పిల్లర్లు లేపి మధ్యలో గేటు పెట్టించి ప్రాజెక్టు పూర్తిచేశామని భజన చేసుకున్నారని విమర్శించారు.

స్పిల్ వే నిర్మాణం పూర్తిచేసింది జగన్ ప్రభుత్వమేనని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 2022 ఆగస్టులో స్పిల్ వే గేట్లను, వరద నీటిని ఓ స్లైడ్ లో చూపించారు. చంద్రబాబు తొందరపడి నిర్మించడం వల్ల డయాఫ్రం వాల్ వరదల వల్ల దెబ్బతిందని, దీంతో రూ.400 కోట్ల ప్రజల సొమ్ము వరదల పాలైందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ శని అంటూ ఆరోపించారు కానీ రాష్ట్రానికి, ప్రాజెక్టులకు పట్టిన శని చంద్రబాబేనని మంత్రి మండిపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని, ఆ శనిని వదిలించుకోవడానికి ప్రజలు రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకున్నారని మంత్రి చెప్పారు. వైఎస్ చనిపోయాక మళ్లీ రాష్ట్రానికి శనిలా పట్టుకున్నాడని చంద్రబాబుపై మంత్రి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News