United Airlines: తాగొచ్చి విమానం నడిపేందుకు సిద్ధమైన పైలట్ కు 6 నెలల జైలు శిక్ష!

  • ఫ్రాన్స్‌లో యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెలుగు చూసిన ఘటన
  • మద్యం మత్తులో విమానం నడిపేందుకు సిద్ధమైన పైలట్
  • పైలట్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఆల్కహాల్ టెస్టు నిర్వహించిన భద్రతా సిబ్బంది
  • పరీక్షల్లో బయటపడ్డ పైలట్ బాగోతం
  • నిందితుడికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, అయిదు వేల డాలర్ల జరిమానా
  • పైలట్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన ఎయిర్‌లైన్స్
United airlines Pilot jailed for six months after he was found attending work in drunken state

మద్యం మత్తులో విధులకు హాజరైన ఓ పైలట్‌కు తాజాగా ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఫ్రాన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఇటీవల పారిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి బయలుదేరేందుకు సిద్ధమైంది. ప్రయాణికులందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు. కానీ భద్రతాధికారులకు పైలట్ తీరుపై సందేహం కలిగింది. ఎరుపెక్కిన కళ్లతో అతడు తూలుతూ కనిపించడంతో వారికి అనుమానమొచ్చి ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో పైలట్ నిబంధనలను అతిక్రమించి మద్యం తాగినట్టుగా తేలింది. అనుమతికి మించి ఆరు రెట్లు మద్యం స్థాయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, పైలట్‌ను అరెస్ట్ చేసి విమాన సర్వీసును రద్దు చేశారు. 

కాగా, పైలట్ న్యాయస్థానం ముందు తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. అంతకుముందు రోజు రాత్రి కేవలం రెండు గ్లాసుల మద్యం మాత్రమే తాగినట్టు చెప్పుకొచ్చాడు. అతడు చెప్పినదంతా విన్న న్యాయస్థానం నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటూ అయిదు వేల డాలర్ల జరిమానా విధించింది. మరోవైపు, ఎయిర్‌లైన్స్ కూడా నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇటువంటి నిర్లక్ష్యాన్ని అస్సలు సహించబోమని హెచ్చరించింది.

More Telugu News