Chandrababu: పోలవరానికి జగనే శని... చంద్రబాబు 'పవర్'ఫుల్ ప్రజంటేషన్

  • రాష్ట్రంలోని జల ప్రాజెక్టులపై ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు 
  • నిన్న రాష్ట్రంలోని ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
  • నేడు పోలవరం ప్రాజెక్టుపై మీడియా సమావేశం
  • దుర్మార్గుడు, మూర్ఖుడు అంటూ సీఎం జగన్ పై విమర్శలు
  • పోలవరంను సర్వనాశనం చేశాడని మండిపాటు
Chandrababu power point presentation on Polavaram Project

రివర్స్ టెండరింగ్ తో జగన్ రాష్ట్రాన్నే రివర్స్ చేశాడని, డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ మూర్ఖపు నిర్ణయాలే కారణమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను అన్ని వ్యవస్థలు తప్పు పట్టాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.11,537 కోట్లు ఖర్చు చేస్తే... వైసీపీ రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

నాడు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్... నేడు ముంపు బాధితలను ముంచేశాడని అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రం మెడలో మణిహారం వేద్దాం అని తాను భావిస్తే... ఆ కలను జగన్ నాశనం చేశాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలోని వివిధ జల ప్రాజెక్టులపై నిన్న పార్టీ  ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన చంద్రబాబు.... నేడు ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫుల్ ప్రంజటేషన్ ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాటినుంచి నేటి వరకు జరిగిన సంఘటనలను మీడియా సమావేశంలో ఎలక్ట్రానిక్ స్క్రీన్ పై వివరించారు. 

ఆ కారణంతోనే పోలవరానికి సిద్ధపడ్డాను

రాష్ట్ర ప్రజల తరతరాల ఆకాంక్ష పోలవరం. బ్రిటీష్ పాలకులు 1941లో పోలవరం నిర్మాణంపై ఆలోచన చేశారు. ఎక్కువ ఖర్చు అవుతుందని కొన్ని కారణాలతో విరమించుకున్నారు. దేశంలోని పుణ్యనదుల్లో పవిత్ర గోదావరి ముఖ్యమైనది. 

గంగా, కావేరి అనుసంధానంతో దేశానికే మంచి జరుగుతుందని నాడు వాజ్ పేయి ప్రభుత్వానికి చెప్పాను. దానిపై ఎన్.డీ.ఏ ప్రభుత్వం సురేశ్ ప్రభు ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. ఏ పనైనా శ్రద్ధ పెట్టి చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. 

రాష్ట్రంలో నదుల అనుసంధానం చేయాలన్న ప్రగాఢ ఆకాంక్షతో పోలవరం నిర్మాణానికి సిద్ధపడ్డాను. అలాంటి ప్రాజెక్టును దుర్మార్గులు అహంకారంతో చేజేతులా నాశనం చేశారు. అందుకే అంటున్నాం.... పోలవరానికి జగనే శని అని.

పోలవరం ప్రాజెక్ట్ స్వరూప స్వభావం ఇదీ...

గోదావరి నుంచి ప్రతి సంవత్సరం 2 వేల నుంచి 4 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఆ నీటిని సమర్థంగా వాడుకుంటే రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. 194 టీఎంసీల నీటి సామర్థ్యంతో పోలవరం నిర్మాణం మొదలెట్టాం. మరో 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశముంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

28.50 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం లైఫ్ లైన్... పెద్ద ఆస్తి... 5 కోట్ల ప్రజల కల. కల సాకారమయ్యే వేళ దుర్మార్గుల చేతిలో బలైపోయింది.

ఇంత వరద ఎక్కడా రాదు

50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ఏకైక నది గోదావరి. 100 మీటర్ల లోతైన డయాఫ్రమ్ వాల్ పోలవరం ప్రత్యేకత. దేశంలో ఏ ప్రాజెక్ట్ కు ఇంత లోతులో డయాఫ్రమ్ వాల్ నిర్మించలేదు. 20 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పున్న అతిపెద్ద గేట్లు, 354 కిలోమీటర్ల పొడవున్న కుడి, ఎడమ కాలువలు. 

నిర్మాణపరంగా దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. 24 గంటల్లోనే 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ తో గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు, బ్రహ్మండమైన అటవీప్రాంతంతో పర్యాటకాభివృద్ధికి గొప్ప అవకాశాలు ఉన్నాయి.

టీడీపీ హయాంలో పోలవరం పురోగతి

నేను ముఖ్యమంత్రి అవుతూనే ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆలోచించాను. ఎన్.డీ.ఏ ప్రభుత్వా న్ని కలిసి, ప్రాజెక్ట్ నిర్మాణానికి అత్యంత కీలకమైన 7 ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. 

ఆ 7 మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ పూర్తికాదు... తద్వారా ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయలేనేమో అని భావించాను. అందుకే ముంపు మండలాలను విలీనం చేస్తే తప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చెప్పాను. 7 మండలాలను ఏపీలో కలుపుతూ  ఆర్డినెన్స్ జారీచేశారు. తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధికి, నాటి ఎన్.డీ.ఏ సహకారానికి ఇదే నిదర్శనం. 

వై.ఎస్.నిర్వాకంతో ప్రాజెక్ట్ పదేళ్లు ఆలస్యం

2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్ని మధుకాన్, శీనయ్య అండ్ కంపెనీకి కట్టబెట్టారు. 2009లో రెండు సంస్థల్ని రద్దు చేశారు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులు నిర్లక్ష్యం చేశారు. కేవలం కాలువల తవ్వకంపై దృష్టిపెట్టారు. రైతులకు, నిర్వాసితులకు రూపాయి పరిహారం ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాల్ని పరిష్కరించలేదు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులే జరిగాయి. రూ.423 కోట్లు ఖర్చుపెట్టారు.  

జగన్ అడుగుపెట్టాడు... పోలవరానికి దుర్గతి పట్టింది

ఈ ముఖ్యమంత్రి వచ్చీరాగానే రివర్స్ టెండరింగ్ అన్నాడు. ప్రాజెక్ట్ వ్యయం తగ్గిస్తానని, ఇన్ని వందల కోట్లు తగ్గాయని ప్రగల్భాలు పలికాడు. అలా చేయవద్దని చెప్పినా వినలేదు. పనులు రద్దు చేస్తే అనేక సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పినా ఖాతరు చేయకుండా మూర్ఖత్వంతో ముందుకెళ్లాడు. 

ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, మార్చవద్దని 13 ఆగస్ట్ 2019న  (పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ) పీపీఏ చెప్పింది. 2009లో వై.ఎస్ కాంట్రాక్ట్ సంస్థను మార్చడం వల్ల పనులు నిలిచిపోయాయని చెప్పింది.

కొత్త కాంట్రాక్ట్ సంస్థ రావడంవల్ల పనుల్లో ఆలస్యం జరుగుతుందని, పాత సంస్థ చేసిన పనులకు కొత్త సంస్థ బాధ్యత వహించదని చెప్పింది. అయినా ఈ మూర్ఖుడు వినలేదు. 

తన బంధువుతో కమిటీ వేసుకున్నారు

టీడీపీ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి పీపీఏ, కేంద్ర మంత్రుల ప్రశంశలు, అవార్డులు, గిన్నిస్ రికార్డులు లభిస్తే, ఇప్పుడు కేంద్రంతో చీవాట్లు తింటున్నారు. వరదలు వస్తే నిర్వాసితుల్ని గాలికి వదిలేశారు. రెండు టమాటాలు. బంగాళాదుంపలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. మేం చేసిన పనుల్లో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారు. తన బంధువుతో కమిటీ వేయించి, చివరకు ఏమీ తేల్చలేక చేతులు ముడుచుక్కూర్చున్నాడు.

నాలుగేళ్లలో నిర్వాసితులకు ఒక్క ఇల్లు కట్టలేదు

పోలవరం నిర్వాసితులకు తన తండ్రి ఎకరాకు రూ.2 లక్షలిస్తే దాన్ని తప్పుపట్టాడు. రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తే ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తుందని ప్రగల్భాలు పలికాడు. సకల వసతులతో నిర్వాసితులకు కాలనీలు నిర్మిస్తానన్నాడు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు. టీడీపీ ప్రభుత్వంలో కేంద్రమిచ్చిన నిధులు చాలక, రాష్ట్ర నిధులు కలిపి అత్యాధునిక వసతులతో నిర్వాసితులకు కాలనీలు నిర్మించాం. 

టీడీపీ ప్రభుత్వం రూ.4,114 కోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రబుద్ధుడు రూ.1,890 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ సొమ్ము కూడా తన పార్టీ వారి జేబుల్లోకే వెళ్లింది కానీ నిర్వాసితులకు రూపాయి అందలేదు. నిర్వాసితుల పొట్టకొట్టిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి.

పోలవరం నిర్మాణంపై పలుసందర్భాల్లో జగన్ వ్యాఖ్యలు ఇవిగో: చంద్రబాబు

తన ప్రజంటేషన్ సందర్భంగా చంద్రబాబు గతంలో పోలవరంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా పంచుకున్నారు.

ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాము. వర్షాలు తగ్గిన వెంటనే పనులు జరుగుతాయి. ప్రాజెక్ట్  ను 2021 జూన్ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తాం... ప్రాజెక్ట్ బాగా స్పీడ్ తో పనిచేస్తోంది”

“పోలవరం ప్రాజెక్ట్ ను ఖరీఫ్ 2022 నాటికి పూర్తి చేస్తాం. అప్పటికి కచ్చితంగా నీళ్లిస్తాం”

“అవరోధాలు అన్నీ అధిగమించి, 2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తాం”

“క్రెడిబులిటీ అనేది మనం చేసే పనుల్ని బట్టి ఉంటుంది”

ఇవీ వీళ్ల మాటలు. వీళ్లతో మనం మాటలు పడాలి... వీళ్ల చేష్టలు, చర్యలతో ప్రజలు ఇబ్బందులు పడాలి. వీళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టను. చేతగాని దద్దమ్మ రాజకీయాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 

నిన్న కూడా పెద్దిరెడ్డి ఏవేవో కథలు చెబుతున్నాడు. మీకంటే బాగా మేం మాట్లాడగలం... కానీ సభ్యత, సంస్కారం, విశ్వసనీయతకు కట్టుబడేవాళ్లం కాబట్టి, ప్రజల కోసం సంయమనం పాటిస్తున్నాం.

పోలవరం మణిహారం

69 నదులనే పుష్పాలను మాలగా మార్చే దారమే పోలవరం నిర్మాణం... ఆ పుష్ప హారాన్ని తెలుగు తల్లికి మణిహారంగా సమర్పించాలనుకున్నాను. 40 ఏళ్ల పాటు ప్రజలు నన్ను ఆదరించారు. నా తెలివితేటలు, శక్తిసామర్థ్యాలతో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేశాను. దాని నమూనానే హైదరాబాద్ అభివృద్ధి. ఐటీ పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలిచాను. దాంతో మనవాళ్లు ప్రపంచాన్ని జయించే స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత ఆ స్థాయిలో నా మనసుకి దగ్గరైన కార్యక్రమం పోలవరం నిర్మాణం... నదుల అనుసంధానం.

పోలవరం పూర్తయితే నా జీవితానికి సార్థకత చేకూరినట్టే అని భావించాను. పోలవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయడానికి నిరంతరం శ్రమించాను. గడ్కరీ గారిని కలవడానికి పండుగ రోజున నాగ్ పూర్ లోని ఆయనింటికి వెళ్లాను. 

గడ్కరీ, అరుణ్ జైట్లీ ఒకసారి డబ్బులిస్తాం గానీ... భూ సేకరణ మీరే చేసుకోవాలన్నారు. ఏం చేయాలో అర్థంకాక అధికారులు, న్యాయవాదులతో మాట్లాడాను. చట్టంలో ఏం చెప్పారో... ఇప్పుడేమంటున్నారో ఆలోచించమని గడ్కరీ, అరుణ్ జైట్లీలతో మాట్లాడాను. చివరకు వారు ఒప్పుకున్నారు. 

ఇవి చేసింది నా సొంతానికి, స్వార్థానికి కాదే,  కేసుల కోసం చేయలేదే. ఇవన్నీ తలుచుకుంటే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. తట్టుకోలేని ఆవేదన, ఆవేశం వస్తాయి. ఇప్పటి వరకు ప్రజలకు వీళ్లు చూపించారు... ఇకనుంచి ప్రజలు వీళ్లకు చూపిస్తారు. 

నాలుగేళ్లలో తిట్టడం తప్ప, ఈ మంచి పని చేశానని చెప్పగలడా? ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉండి ఊరికే రంకెలేస్తోనో, బూతులు తిడితేనో, వ్యక్తిత్వ హననానికి పాల్పడితేనో సమస్యలు పరిష్కారం కావు" అని చంద్రబాబు భావోద్వేగభరితంగా వివరించారు. అన్నారు.

More Telugu News