YS Sharmila: తెలంగాణలో మహిళలు, బాలికల మిస్సింగ్‌పై వైఎస్ షర్మిల ఏమన్నారంటే...!

YS Sharmila on Women and girls missing from Telangana
  • దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేదని ఆవేదన
  • రెండేళ్లలోనే 34,495 మంది మహిళలు, 8,066 మంది బాలికలు మిస్ అయ్యారని ఆగ్రహం
  • దేశంలో నెంబర్ వన్ పోలిసింగ్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్న
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత మూడేళ్లలో అదృశ్యమైన మహిళలు, బాలికల గణాంకాలను కేంద్రం బుధవారం వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వుమెన్ ట్రాఫికింగ్ వార్తలు కలకలం రేపాయి. తెలంగాణలో మిస్సైన మహిళలు, బాలికల గణాంకాలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.

దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణేలేదని, కంటికి కనపడకుండా పోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్ లో మొద్దు నిద్ర పోతున్నాడని, రెండేళ్లలోనే 34,495 మంది మహిళలు, 8,066 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే... కేసీఆర్ ఇందుకు తలదించుకోవాలని మండిపడ్డారు. 

మహిళల భద్రతకు పెద్దపీట అని చెప్పుకున్నందుకు సిగ్గుపడాలన్నారు. ఆడవారి పట్ల వివక్ష చూపే ఈ బందిపోట్ల పాలనలో కనీసం మిస్సింగ్ కేసులు నమోదైనా దర్యాప్తు శూన్యమన్నారు. కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ ఆడబిడ్డలకు లేదన్నారు.

దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పే తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ... మహిళలు మాయమవుతుంటే దొరకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థ దొర లెక్కనే నిద్ర పోతోందన్నారు. 

ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో కనీసం 1% కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదన్నారు. దొరకు ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే మిస్సింగ్ కేసులపై దర్యాప్తు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తక్షణం తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ కనిపెట్టాలన్నారు.
YS Sharmila
woman
Telangana
KCR

More Telugu News