Ambati Rambabu: ఎన్టీఆర్‌ను ముంచినట్లుగానే చంద్రబాబు ప్రాజెక్టులనూ ముంచేశాడు: అంబటి ధ్వజం

  • తన ప్రయోజనాల కోసం నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణ
  • చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని  వ్యాఖ్య
  • ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో పట్టిసీమ ఉపయోగం లేదన్న మంత్రి
Ambati says Chandrababu dumps all projects in tdp regime

రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు లేదని మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రయోజనాల కోసం నిధులను దుర్వినియోగం చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.

తనకు లాభం వచ్చిన ప్రాజెక్టులనే చంద్రబాబు తన హయాంలో కట్టారని, వీటిని తన దోపిడీ కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో రూ.27,394 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. చంద్రబాబు మాత్రం తమ హయాంలో రూ.68,294 కోట్లు ప్రాజెక్టుల కోసం ఖర్చుపెట్టామని చెప్పడానికి బదులు మేం.. తిన్నాము అని అంటే బాగుండేదని విమర్శించారు. ఇక ఆయన పట్టిసీమ గురించి మాట్లాడుతుంటారని, అదొక ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి, రాయలసీమకు మేలు చేశామని చెబుతున్నాడని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ.257 కోట్లు కొట్టేశాడన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలు, అవాస్తవాలే అన్నారు.

వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో కరవు మండలాలు ప్రకటించే అవసరం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. ఈ అయిదేళ్లు వర్షాలు బాగా కురిశాయని, దీంతో పట్టిసీమ ప్రాజెక్టును ఉపయోగించే అవసరం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, కానీ చేసిందేమీ లేదన్నారు.

పురుషోత్తం ప్రాజెక్టుకు అనుమతులే లేవని, కానీ అశాస్త్రీయంగా రూ.1600 కోట్లు వృథా చేశారన్నారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని నిలదీశారు. ఎన్టీఆర్ ఎన్నో ప్రాజెక్టులకు డిజైన్ చేస్తే, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన మామను ముంచినట్లుగా ప్రాజెక్టులను ముంచినట్లు చెప్పారు. ఆ తర్వాత వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించారన్నారు.

More Telugu News