JC Prabhakar Reddy: తాడిపత్రి నా ఇల్లు... ప్రాణాలు ఉన్నంత వరకు కాపాడుకుంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • వారం రోజులుగా టీడీపీ కౌన్సిలర్ల నిరసన
  • కమిషనర్ కనీసం తమతో చర్చించడంలేదని జేసీ ఆగ్రహం
  • మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయించిన జేసీ, టీడీపీ కౌన్సిలర్లు
JC Prabhakar Reddy protests at Tadipatri municipal office

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలని, కమిషన్ వెంటనే సమాధానం చెప్పాలని నినాదాలతో హోరెత్తించారు. మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పాటించాలని వారు డిమాండ్ చేశారు. 

టీడీపీ కౌన్సిలర్ల ధర్నా నేపథ్యంలో కమిషనర్ అక్కడే నిల్చుండిపోయారు. ఈ సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఆయన చాంబర్ లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు అక్కడ స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. 

మున్సిపల్ కార్యాలయం వద్దే బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ అంశాలను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. తన తండ్రి హయాం నుంచి చూస్తే తాడిపత్రికి తమ కుటుంబానికి 120 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. తాడపత్రి తమకు ఇల్లు వంటిదని జేసీ తెలిపారు. 

"ఒకప్పుడు తాడిపత్రి నెంబర్ వన్ మున్సిపాలిటీ. ఇలాంటి మున్సిపాలిటీ దేశంలోనే ఎక్కడా లేదు. చూడండి... ఇక్కడంతా సెంట్రల్ ఏసీయే. ఆఖరికి నా బాత్రూం కూడా సెంట్రల్ ఏసీయే.  అలాంటి మున్సిపాలిటీని సర్వనాశనం చేశారు. పరిస్థితులు ఇలా క్షీణిస్తుంటే చూస్తూ ఉండగలమా? అయినా మాకు ప్రోటోకాల్ తో ఏం పని? నన్ను ఎక్కడికెళ్లినా గుర్తిస్తారు... నేను ఫ్లెక్సీలు కూడా వేసుకోను. 

ఇవాళ మేం పోరాడుతున్నది మా కోసం కాదు. అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. తాడిపత్రి మున్సిపాలిటీకి ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోంది. మున్సిపాలిటీ సంక్షేమమే మా పోరాటానికి ప్రధాన అజెండా. రాజ్యాంగం అమలు జరుగుతున్న సూచనలే లేవు. 

ఇంతకుముందు ఓ పోలీసు అధికారి (చైతన్య) ఉండేవాడు.... చెత్తబండి తీసుకెళితేనే హౌస్ అరెస్ట్ అనేవాడు. ఇప్పుడా పోలీసు అధికారి ఇక్కడనుంచి వెళ్లిపోయాడు... ఇప్పుడున్న పోలీసులు ఆలోచనాపరులు. వారి వల్ల నేను స్వేచ్ఛగా ధర్నా చేసుకోగలుగుతున్నాను. వారికి కృతజ్ఞతలు. 

నా బస్సుల వ్యాపారం, ఇంకా ఇతర అంశాలు ఏమనా అయిపోనీ గానీ.... నన్ను పెంచి పోషించిన ఊరు (తాడిపత్రి) ఉందే... దీనికోసం తగువులాడతాను, కొట్లాడతాను, ప్రాణాలైనా ఇస్తాను. హైటెక్ సిటీలో ఉండే సౌకర్యాలతో కూడిన మా ఏసీ మున్సిపాలిటీని అదే ప్రమాణాలతో కొనసాగించాలని కోరుకుంటున్నాం. మనం ఉంటాం, పోతాం... కానీ ప్రజల కోసం ఈ మున్సిపాలిటీ సజావుగా కొనసాగాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేం ఫైట్ చేస్తున్నాం. 

ఈ ప్రభుత్వం ఉంటే మరో 9 నెలలు ఉంటుందేమో. నేను 72 ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నాను... ఇకముందు కూడా ప్రజల కోసమే ఉంటా. వాళ్ల (కేతిరెడ్డి పెద్దారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి)కు భయపడేది లేదు. 72 ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నా, ఈ గవర్నమెంట్ లేకుండా వాళ్లను ఉండమనండి చూద్దాం. అసలు వాళ్ల గురించి నేను మాట్లాడకూడదు. వాడు (కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి) చిన్నపిల్లవాడు... వాడికేం తెలుసు. అతడు కూడా ఓ వార్డు కౌన్సిలర్ కాబట్టి ఇక్కడికి వచ్చుంటాడు. 

వారం రోజుల నుంచి మేం నిరసనలు చేస్తున్నాం... డిమాండ్లపై కమిషనర్ ను దండం పెట్టి అడిగాను... అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. నేనేమీ దబాయించి అడగలేదే. కమిషనర్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? నేను ఉన్నంత వరకు ఇక్కడే ఉంటా... ప్రాణాలు ఉన్నంత వరకు ఈ ఊరిని కాపాడుకుంటా. ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ పోరాటం ఎంతమాత్రం కాదు. ఇది మున్సిపల్ కమిషనర్ కు నా టౌన్ కు మధ్య జరుగుతున్న వ్యవహారం. ఇది పొలిటికల్ అయితే బయటే చూసుకునేవాళ్లం" అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News