Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ లో చిల్లర దొంగలు

  • విజిటర్స్ బిల్డింగ్ లోని బాత్రూంలలో నల్లాల చోరీ
  • కొత్తవి అమర్చుతున్నా మళ్లీ మళ్లీ ఎత్తుకెళుతున్న వైనం
  • బయటకు వచ్చేటపుడు తనిఖీ చేయకపోవడంతో రెచ్చిపోతున్న దొంగలు
Thieves steal taps from washrooms in telangana secretariat building

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. విజిటర్స్ బిల్డింగ్ లో పదే పదే దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇంతకీ ఈ దొంగలు ఎత్తుకెళ్లేది ఏంటంటే.. బాత్రూంలలో అమర్చిన నల్లా (ట్యాప్)లేనని అధికారులు చెబుతున్నారు. సెక్రటేరియట్ ముందు ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే సెక్యూరిటీ సిబ్బంది జనాలను లోపలికి వదులుతున్నారు. అయితే, బిల్డింగ్ వెనకవైపు సెక్యూరిటీ తనిఖీ అంతంత మాత్రమేనని సమాచారం.

అందులోనూ బిల్డింగ్ లోపలికి ప్రవేశించే వారిని తనిఖీ చేయడంపైనే సిబ్బంది దృష్టి పెడుతున్నారని, లోపలి నుంచి బయటకు వచ్చే వారిని తనిఖీ చేయడంలేదని తెలుస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్న దొంగలు.. విజిటర్స్ బిల్డింగ్ లోకి ప్రవేశించి, బాత్రూంలలో నల్లాలను విప్పి తీసుకెళుతున్నారని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ లోని జెంట్స్ టాయిలెట్లలో ఈ చోరీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయట. ఇప్పటికే పలుమార్లు దొంగతనం జరగడంతో ప్లాస్టిక్ నల్లాలను అమర్చామని, వాటిని కూడా వదలడంలేదని మెయింటనెన్స్ సిబ్బంది వాపోతున్నారు.

More Telugu News