Karnataka: బైక్ ను తప్పించే ప్రయత్నంలో యువతులను ఢీ కొట్టిన కారు.. వీడియో ఇదిగో!

  • రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థినులు
  • వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో ఎగిరిపడ్డ యువతి
  • బైకర్ తో పాటు యువతికి స్వల్ప గాయాలు..
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
speeding car colliding with a bike and two young female students in Karnataka

కర్ణాటకలోని రాయ్ చూర్ లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థినులపైకి ఓ కారు దూసుకెళ్లింది. వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఓ విద్యార్థిని ఎగిరిపడింది. సడెన్ గా యూటర్న్ తీసుకున్న ఓ బైకర్ ను తప్పించే క్రమంలో ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో అటు బైకర్ తో పాటు ఇటు విద్యార్థిని కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ నెల 18న రాయ్ చూర్ లో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నెల 18న రాయ్ చూర్ లోని రాఘవేంద్ర పెట్రోల్ పంప్ దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారును గమనించకుండా ఓ బైకర్ యూటర్న్ తీసుకున్నాడు. అప్పటికే చాలా దగ్గరగా వచ్చేసిన కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తొలుత బైక్ ను ఆపై రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులను ఢీ కొట్టాడు. కారు వేగానికి ఓ స్టూడెంట్ దూరంగా ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు.

More Telugu News