rain: ముత్యాల జలపాతం అడవుల్లో చిక్కుకున్న 84 మంది టూరిస్ట్‌లు!

84 tourists standered in Mulug Muthyala Jalapatham
  • ఉదయం సందర్శనకు వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుండగా ఉప్పొంగిన వాగు
  • దీంతో అడవిలో చిక్కుకుపోయిన పర్యాటకులు
  • డయల్ 100 ద్వారా వెలుగు చూసిన సంఘటన
  • వారిని తీసుకువచ్చేందుకు అధికారుల ప్రయత్నాలు
తెలంగాణలోని ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులు అక్కడే అడవిలో చిక్కుకుపోయారు. బుధవారం ఉదయం వెంకటాపురం పరిధిలోని ఈ జలపాతం సందర్శనకు వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తుండగా మధ్యలోనే భారీ వర్షాలకు వాగు ఉప్పొంగింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. డయల్ 100 ద్వారా పర్యాటకులు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగు చూసింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగనుంది. పర్యాటకులను వెంటనే క్షేమంగా తీసుకు రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. 

మరోవైపు మహబూబాబాద్ నామాలపాడు వద్ద జిన్నెల వాగు పొంగిపొర్లింది. దీంతో ఓ ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసి, ఆ తర్వాత ట్రాక్టర్ సాయంతో బస్సును ఒడ్డుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి వరద పోటెత్తింది. నీటి మట్టం పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం నీటి మట్టం 44.4 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
rain
Telangana
Andhra Pradesh

More Telugu News