Nara Lokesh: బాహుబలిలో కుంతల రాజ్యం.. ఏపీలో గుంతల రాజ్యం: జగన్‌పై లోకేశ్ పంచ్

Nara lokesh lashes out at Jagan in Ongole meeting during yuvagalam padayatra
  • యువగళం పాదయాత్రలో భాగంగా ఒంగోలులో నారా లోకేశ్ బహిరంగ సభ
  • సభలో వైసీపీ పాలనను చీల్చిచెండాడిన యువనేత
  • దేశంలో వంద సంక్షేమ పథకాలను కట్ చేసిన ఏకైక నేత జగన్ అని వ్యాఖ్య
  • జగన్‌కు బడుగు బలహీన వర్గాలపై చిన్నచూపంటూ మండిపాటు 
  • లోకేశ్‌కు బ్రాహ్మణుల వినతిపత్రం, సమస్యలు పరిష్కరిస్తామని యువనేత హామీ
యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశామన్న ఆయన, జగన్ పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని ఎద్దేవా చేశారు. 

‘‘జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక కటింగ్, ఫిటింగ్ మాస్టర్, జగన్ దగ్గర రెండు బటన్లు ఉంటాయి. బల్లపైన బ్లూ బటన్, బల్లకింద రెడ్ బటన్. భారత దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక నాయకుడు ఆయనే’’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.

మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ జగన్ నెరవేర్చలేదని లోకేశ్ ఆరోపించారు. మహిళ కన్నీరు తుడిచే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 

దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ స్థానం నెం. 3 అన్న ఆయన కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ నెం.2 స్థానంలో ఉందన్నారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలంటే జగన్‌కు చిన్న చూపని ఆరోపించారు. సంక్షేమాన్ని భారత్‌కు పరిచయం చేసింది టీడీపీనేనని చెప్పారు. పేదలకు జగన్ చేసిందేమీ లేదన్న ఆయన పేదలకిచ్చిన 3 లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కు లాక్కున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టు జగన్ 3 లక్షల ఇళ్లు పూర్తి చేయాలంటే  వంద జన్మలు ఎత్తాలని మండిపడ్డారు. 

నారా లోకే‌శ్‌ను కలిసిన బ్రాహ్మణులు
ఒంగోలు లాయర్ పేట సాయిబాబా గుడివద్ద బ్రాహ్మణ సామాజిక వర్గీయులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు తమ వర్గ సమస్యలు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ను పునరుద్ధరించాలని కోరారు. పురోహితులు, దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పురోహితులు,అర్చకులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. ఆదిశంకరాచార్య జయంతిని రాష్ట్రజాతీయ పండుగగా గుర్తించి సెలవు ఇవ్వాలని, మండల కేంద్రాల్లో ప్రభుత్వ స్థలం కేటాయించి, అందులో కళ్యాణమండపం, పూజలు, గ్రహశాంతులు జరిపే భవనం నిర్మించాలని కొరారు. ఉచిత పూజలు జరిపించేందుకు అవసరమైన నిధులు ఏర్పాటు చేయాలని, బ్రాహ్మణులకు, పురోహితులకు పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వేదపాఠశాలలు నిర్మించి అందులోని విద్యార్థులకు దేవస్థానాల్లో ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.

నారా లోకేశ్ స్పందిస్తూ...జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి అన్నివర్గాలను దారుణంగా మోసగించారని మండిపడ్డారు. దేశంలోనే మొదట 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబునాయుడని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వారి సంక్షేమానికి రూ.282 కోట్లు ఖర్చుచేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్‌ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తాం, విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఆలయాలు, బ్రాహ్మణులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపర కర్మలు నిర్వహించుకోవడం కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
Jagan
Telugudesam

More Telugu News