Byjus: తీవ్ర సంక్షోభంలో బైజూస్.. వ్యవస్థాపకుడి కంటతడి

  • దూబాయ్‌లో నిధుల సమీకరణ కోసం బైజు రవీంద్రన్ విశ్వప్రయత్నాలు 
  • నిధుల సేకరణ కష్టంగా మారడంతో ఇన్వెస్టర్ల వద్ద కన్నీటిపర్యంతం
  • కరోనా సమయంలో మార్పులను అందిపుచ్చుకుంటూ వేగంగా ఎదిగిన బైజూస్
  • భారీగా అంతర్జాతీయ నిధుల సమీకరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనంతో వేగంగా విస్తరణ
  • కరోనా సంక్షోభం ముగిశాక డిజిటల్ విద్యకు తగ్గిన ఆదరణ
  • సంస్థలో నిధుల రాకడ కూడా తగ్గుతుండటంతో కష్టాల్లో కూరుకుపోయిన బైజూస్
Byjus founder in tears after as problems mount up in edtech byjus

భారత ఎడ్ టెక్ రంగంలో అగ్రగామిగా పేరుపడ్డ బైజూస్ సంస్థ ప్రస్తుతం పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. లాభాలు లేక, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అదనపు పెట్టుబడులు అందక కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణలో తలమునకలై ఉన్న సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఒకానొక సందర్భంలో ఇన్వెస్టర్ల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారట. మధ్యప్రాచ్యం నుంచి బిలియన్ డాలర్ నిధుల సేకరణ వ్యవహారం ముందుకుసాగక పోవడంతో ఆయన కన్నీటిపర్యంతమైనట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే సంస్థ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో కేంద్రం స్వయంగా రంగంలోకి దిగింది. ఏప్రిల్‌లో ప్రభుత్వ అధికారులు బెంగళూరులోని సంస్థ కార్యాలయంపై రెయిడ్ నిర్వహించి పలు పద్దు పుస్తకాలు, కంప్యూటర్లు సీజ్ చేశారు. బైజూస్ త్వరగా గాడినపడకపోతే భారత స్టార్టప్‌ సంస్థలపై అంతర్జాతీయంగా సందేహాలు మొదలయ్యే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. 

కేరళకు చెందిన బైజు రవీంద్రన్‌‌ది చిన్నప్పటి నుంచీ ప్రత్యేక శైలి అని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతారు. చదువుకునే సమయంలో ఆయన పలు మార్లు క్లాసులు బంక్ కొట్టి ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లేవారని, తనంతట తానుగా చదువుకుని విషయాలను అర్థం చేసుకునేవారని చెబుతారు. కొంతకాలం ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన ఆ తరువాత బెంగళూరులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. ఆయన బోధనాశైలి స్టూడెంట్లకు నచ్చడంతో పెద్దఎత్తున విద్యార్థులు సంస్థలో జాయినయ్యారు. ఒకానొక దశలో ఆయన ఏకంగా ఓ స్టేడియంలో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి క్లాసులు చెప్పేవారు. అనంతరం ఆయన తన భార్యతో కలిసి బైజూస్ ఏర్పాటు చేశారు. 

ఆ తరువాత డిజిటల్ టెక్నాలజీ విస్తృతంగా వినియోగిస్తూ ఎడ్ టెక్‌ రంగంలో అగ్రగామిగా నిలిచారు. తన వద్ద చదువుకున్న మెరికల్లాంటి వారిని తన సంస్థల్లో టీచర్లుగా చేర్చుకుని గొప్ప విద్యాబోధన అందించారు. 2015-2020 మధ్య కాలంలో భారత్‌లో వేగంగా జరిగిన డిజిటలీకరణను అందిపుచ్చుకుని ఆన్‌లైన్ విద్యాబోధన వైపు మళ్లారు. దేశంలో భారీగా తగ్గుతున్న డేటా ధరలూ ఇందుకు కలిసివచ్చాయి. కరోనా సంక్షోభంలో ప్రజలు డిజిటల్ ప్రపంచంవైపు మళ్లడం ఆయనకు మరింతగా కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే అనేక అంతర్జాతీయ సంస్థలు బైజూస్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరించాయి. ఈ నిధులతో రవీంద్రన్ దూకుడుగా పలు ఎడ్ టెక్ సంస్థలు కొనుగోలు చేస్తూ ఈ రంగంలో వేగంగా విస్తరించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

కానీ కరోనా నుంచి ప్రపంచం కోలుకున్నాక డిజిటల్ బూమ్ కాస్త నెమ్మదించింది. ఈ పరిస్థితుల్లోనూ రవీంద్రన్ నిధుల సమీకరణ కోసం దూకుడుగా ముందుకెళ్లారని, డబ్బుల పొదుపు, సంస్థను లాభాల బాట పట్టించడంపై దృష్టి పెట్టలేదని కొందరు ఉద్యోగులే ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2022లో పలువురు కీలక ఉద్యోగులు, బోర్డు సభ్యులు సంస్థను వీడారు. 
 
సంస్థ కార్పొరేట్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించి రవీంద్రన్ భిన్నమైన పంథాను ఎంచుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టమెంట్ బ్యాంకర్లను సంప్రదించడానికి బదులు ఆయన తన చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అనితా కిషోర్‌పైనే అధికంగా ఆధారపడ్డారని చెబుతారు. మరోవైపు, 2021 సంవత్సరం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంట్స్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు కూడా బైజూస్‌పై దృష్టిసారించారు. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

దాదాపు అర బిలియన్ డాలర్ల పెట్టుబడులు బైజూస్ పద్దు పుస్తకాల్లో కనిపించలేదని కొందరు విదేశీ ఇన్వెస్టర్లు ఆరోపించారు. ఈ విషయమై కొందరు అమెరికా ఇన్వెస్టర్లు కోర్టులో కేసులు కూడా వేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకుల్లో కూరుకుపోయిన బైజూ రవీంద్రన్ ప్రస్తుతం దుబాయ్‌లో అంతర్జాతీయ నిధుల సమీకరణ కోసం ప్రయత్నిస్తూ ఒకానొక సమయంలో కన్నీటి పర్యంతమయ్యారట.

More Telugu News