BJP: పార్లమెంట్ ఆవరణలో కేజ్రీవాల్ పార్టీ ఎంపీని తన్నిన కాకి... బీజేపీ సెటైర్లు

  • రాఘవ్ చద్దాను కాకి తన్నిన ఫొటో నెట్టింట వైరల్
  • అబద్దాల కోరును కాకి పొడుస్తుందనే సామెతతో బీజేపీ వ్యంగ్యాస్త్రాలు
  • ఎంపీపై కాకి దాడి చేసిందనే వార్త తెలిసి బాధేసిందన్న బీజేవైఎం అధ్యక్షుడు
Raghav Chadha gets attacked by crow BJP quips jhooth bole kauvva kate

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దా మంగళవారం పార్లమెంటు భవనం వెలుపల ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ కాకి ఆయనను తన్నింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆయన కాస్త కంగారుపడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వదులుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీని, రాఘవ్ చద్దాను విమర్శించేందుకు వారు దీనిని ఉపయోగించుకున్నారు.

ఝూత్ బోలే కౌవ్వా కాటే (అబద్దాల కోరును కాకి పొడుస్తుంది) అనే పాత హిందీ సామెతతో చురకలు అంటించారు. బీజేపీ ఢిల్లీ యూనిట్ ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ.. అబద్ధాలు ఆడితే కాకి పొడుస్తుందనే సామెత ఉందని, ఇప్పటి వరకు దీని గురించి మనం వింటూ వచ్చామని, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఈ పోస్టుకు గంటల్లోనే వేలాది లైక్స్ వచ్చాయి. అలాగే వేలాది మంది రీట్వీట్ చేశారు.

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజీందర్ పాల్ సింగ్ భగ్గా కూడా ట్విట్టర్ వేదికగా... గౌరవనీయులైన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీపై కాకి దాడి చేసిందనే విషయం తెలిసి నాకు చాలా బాధ వేసిందని, మీరు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తేవడానికి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకు వచ్చే ఆర్డినెన్స్ బిల్లును రాజ్యసభలో అంగీకరించవద్దని ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాశారు. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని కాకి పొడవడంతో బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

More Telugu News