Hyderabad: అమెరికా నిఘా సంస్థ సమాచారంతో చైల్డ్ పోర్నోగ్రఫీని షేర్ చేస్తున్న హైదరాబాద్ స్టూడెంట్ అరెస్ట్

MCA student arrested by rachakonda cyber crime police for sharing child porn clips
  • మహబూబాబాద్‌‌కు చెందిన దీక్షిత్
  • వాట్సాప్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తూ ఇతర గ్రూపులకు షేరింగ్
  • కనిపెట్టిన అమెరికా నిఘా సంస్థ హెచ్ఎస్ఐ
  • ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం
  • అక్కడి నుంచి సీబీఐకి.. సీబీఐ నుంచి తెలంగాణ పోలీసులకు సమాచారం 
చిన్నారుల అశ్లీల చిత్రాలను చూస్తూ వాటిని వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌లోని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన దీక్షిత్ (24) హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఉంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులు పోస్టు చేసిన చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి స్నేహితులతో కలిసి చూసేవాడు. 

ఆ తర్వాత వాటిని ఇతర గ్రూపుల్లో షేర్ చేసేవాడు. ఇలాంటి పనులపై నిఘా పెట్టే అమెరికా దర్యాప్తు సంస్థ హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (హెచ్ఎస్ఐ) అతడి ఫోన్ నంబరును ట్రాక్ చేసి ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి పంపింది. వారు సీబీఐకి సమాచారం అందించారు. సీబీఐ ద్వారా సమాచారం తెలంగాణ సీఐడికి చేరింది. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు ఐదు వాట్సాప్ గ్రూపుల ద్వారా అతడికి వీడియోలు అందుతున్నట్టు గుర్తించి ఆ సమాచారాన్ని రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు అందించడంతో వారు తాజాగా దీక్షిత్‌ను అరెస్ట్ చేశారు.
Hyderabad
Mahabubabad District
Cyber Crime
MCA Student

More Telugu News