Vanama Venkateswara Rao: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటా: వనమా వెంకటేశ్వరరావు

  • వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు
  • 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశానన్న వనమా
  • బీఆర్ఎస్ అధిష్ఠానం అండదండలు ఉన్నాయన్న నేత
  • సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని వ్యాఖ్య
Vanama Venkateswara Rao likely to challenge high court verdict in supreme court

తాను ప్రజాస్వామ్య బద్ధంగానే కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందానని, ప్రజాబలం ఉండడం వల్లే విజయం సాధించానని కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అనేక గెలుపోటములు చవి చూసినట్టు చెప్పారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తాను తుది వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, అక్కడే తేల్చుకుంటానని తేల్చి చెప్పారు. తనకు బీఆర్ఎస్ అధిష్ఠానం అండదండలు ఉన్నాయన్నారు. 

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారంటూ ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నిన్న తీర్పు వెలువరించింది. వనమా ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అంతేకాకుండా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది.

More Telugu News