Pawan Kalyan: నాకు, నాలాంటివారికి సముద్రఖని కనువిప్పు కలిగించారు!: 'బ్రో' ఈవెంటులో పవన్ కల్యాణ్

  • బ్రో మూవీ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్
  • సముద్రఖనికి అభిమానిగా మారిపోయానన్న పవన్
  • తాను కోరుకున్న జీవితం ఇది కాదని వ్యాఖ్య
  • జూ.ఎన్టీఆర్ లా డ్యాన్స్ చేయలేకపోవచ్చునన్న పవన్
  • తన కలలకు వదిన బ్రేక్ వేసిందన్న పవర్ స్టార్
  • సినిమా హీరోలందరూ ఇష్టమే అన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan in Bro pre release event

దర్శకుడు సముద్రఖని తెలుగు స్క్రిప్ట్ చదవడం మాలాంటి వారికి చెంపపెట్టు అని పవన్ కల్యాణ్ అన్నారు. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవర్ స్టార్ మాట్లాడుతూ... ఈ సినిమా సమయంలో తాను సముద్రఖనికి అభిమానిగా మారిపోయానని చెప్పారు. అందుకు ఓ కారణముందన్నారు. తెలుగువారిగా ఉన్న మనకు తెలుగు భాష మాట్లాడటం సరిగ్గా రాదని, మధ్యలో నాలుగైదు ఇంగ్లీష్ పదాలు వస్తాయని, మనం మాట్లాడేదంతా టింగ్లీష్ అన్నారు. కానీ సముద్రఖని తమిళుడని, మన భాష కాదు.. తెలుగువాడు కాదు.. కానీ ఓసారి ఆయన తెలుగు స్క్రిప్ట్ చదువుతుంటే తాను ఆశ్చర్యపోయానన్నారు.

ఒక తమిళ దర్శకుడు తెలుగు స్క్రిప్ట్ చదవడం చూసి కలేమో అనుకున్నానని, ఆ తర్వాత ఆయననే అడిగానని, తెలుగు వస్తుందా? అని అడిగితే.. ఏడాదిగా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అందుకే నేను సముద్రఖనికి హామీ ఇస్తున్నానని ఓ రోజు తమిళం నేర్చుకొని, తమిళంలో ప్రసంగిస్తానని, తిరుక్కురల్ చెబుతానని అన్నారు. ఆయన తెలుగు భాష తనకు, తనలాంటి వారికి చెంపపెట్టు అన్నారు. తెలుగు భాషను పట్టించుకోని మాలాంటి వారందరికీ సముద్రఖని కనువిప్పు కలిగించారన్నారు. ఇందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

నేను కోరుకున్న జీవితం కాదు ఇది

అసలు ఇది తాను కోరుకున్న జీవితం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు ఈ జీవితం భగవంతుడు ఇచ్చారన్నారు. తాను నటుడు అవ్వాలనుకోలేదని, ఆ తర్వాత రాజకీయాల్లోను ఉంటానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. తాను చిన్న జీవితం కోరుకున్నానని చెప్పారు. తన పట్ల చూపే అభిమానుల అభిమానం గొప్పది అన్నారు. సమాజం నుండి తీసుకోవడం మాత్రమే కాదని, ఏదైనా ఇవ్వాలని సముద్రఖని చెబుతుంటారని, అలాంటి సంపూర్ణ సినిమా ఇది అన్నారు. కరోనా సమయంలో, రాజకీయాల్లో తిరగలేని సమయంలో ఈ సినిమా తన వద్దకు వచ్చిందన్నారు. అభిమానులకు పవన్ ఎలా నచ్చుతాడో అలా చూపించారన్నారు.

నేను జూ.ఎన్టీఆర్ లా డ్యాన్స్ చేయకపోవచ్చు..

తనకు సినిమాలు అంటే ఇష్టమైనప్పటికీ పొలిటికల్ మైండ్ సెట్ కు వెళ్లాక అంతగా సమయం కుదరనప్పటికీ తనకు అనుకూలంగా నిర్మాణం చేశారన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లా అద్భుతంగా డ్యాన్స్ చేయలేకపోవచ్చునని, ప్రభాస్, రానాల వలె ఏళ్లకొద్ది కష్టపడి పని చేయకపోవచ్చునని, కానీ తనకు సినిమాలు అంటే ఇష్టమన్నారు. ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదని, మా కుటుంబానిదీ కాదని, అందరిదీ అన్నారు. తనకు ప్రతి నటుడు అంటే ఇష్టమని, ఎందుకంటే అందరం గొడ్డు చాకిరి చేస్తామన్నారు.

ప్రతి ఒక్కరు ఏదైనా బలంగా అనుకుంటే సాధించవచ్చునని అభిమానులకు సూచించారు. రాజకీయమైనా.. సినిమా అయినా.. చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. తమ కుటుంబం దిగువ మధ్యతరగతి కుటుంబమని, తన అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ డమ్ సాధించాక హీరో అవ్వాలని అనుకోలేదని, చిన్న ఉద్యోగం, రైతులా చిన్న జీవితం గడపాలని భావించానని చెప్పారు. అయినా చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఉన్నారని చెప్పారు. 

మా వదిన ద్రోహం..

కానీ చిన్న జీవితం గడపాలనుకున్న నా మనసుకు మా వదిన బ్రేక్ వేశారని, ఆ రోజు మా వదిన చేసిన తప్పు ఇప్పుడు నన్ను ఇలా నిలబెట్టిందన్నారు. లేదంటే చిన్న జీవితం గడిపేవాడినని చెప్పారు. తాను చిరంజీవి తమ్ముడ్ని అయినప్పటికీ మొరటు మనిషిని అని, తనలో రైతు ఉన్నాడన్నారు. నాకు తెలిసింది త్రికరణశుద్ధిగా పని చేయడమన్నారు. ఇదే తనకు కోట్లాది మంది అభిమానులను తయారు చేసి పెట్టిందన్నారు. ప్రతి ఒక్కరికి గెలుపోటములు ఉంటాయన్నారు. కానీ మాలాంటి మధ్యతరగతి కుటుంబం వారు ఇలా చేసినప్పుడు అనుకుంటే ప్రతి ఒక్కరు అనుకున్నది సాధించగలరన్నారు.

సినిమా హీరోలు లేదా నటులు అందరూ తనకిష్టమేనని, ఎందుకంటే వారు దోపిడీ చేయరన్నారు. వారు కష్టపడి సినిమాలు చేస్తే వందలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతోందన్నారు. ఒక హీరో సినిమా చేస్తే వేల మంది జీఎస్టీ కడుతున్నారన్నారు. తనకు చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేదన్నారు. కానీ నేను సినిమా చేసేటప్పుడు మాత్రం నా సినిమా మిగతా వారి కంటే పెద్ద హిట్ కొట్టాలనుకుంటానని చెప్పారు. సినిమా చేసినప్పుడు ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలన్నారు. బాహుబలి వంటి సినిమాలు అంతర్జాతీయస్థాయికి వెళ్లినప్పుడు సంతోషిస్తానన్నారు. కాగా పవన్ మాట్లాడే సమయంలో సీఎం.. సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు.

More Telugu News