Mamata Banerjee: ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు మమతా బెనర్జీ గట్టి కౌంటర్

  • ఇండియన్ ముజాహిద్దీన్, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ I-N-D-I-A కూటమిపై మోదీ విమర్శ
  • ఇండియా పేరు ప్రధాని మోదీకి ఇష్టమని భావిస్తున్నానన్న మమతా బెనర్జీ
  • సాధారణ పౌరులలా ఆయన కూడా ఈ పేరును అంగీకరించారన్న బెంగాల్ సీఎం
Mamata Banerjees Comeback To PMs Remark On Opposition Fronts New Name

విపక్షాల కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. గవర్నర్ సీవీ ఆనంద బోస్ తో భేటీ అయిన మమత ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... I-N-D-I-A పేరు ప్రధాని మోదీకి, బీజేపీకి ఇష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ తమ కూటమి పేరుపై ఎంతగా విషం కక్కితే తాము అంతగా ఆ పేరును ప్రజలు ఇష్టపడేలా చేస్తామన్నారు.

'మన ప్రధానికి ధన్యవాదాలు. ఆయనకు 'ఇండియా' పేరు ఇష్టమని నేను భావిస్తున్నాను. సాధారణ ప్రజలలా ఆయన కూడా దీనిని అంగీకరించారు. I-N-D-I-A పేరు గురించి ఎంత చెడుగా మాట్లాడితే, వారు దానిపై తమ ఇష్టాన్ని అంతగా చూపిస్తారు' అని అన్నారు.

బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. I-N-D-I-A కూటమికి దశ దిశ లేదని ఎద్దేవా చేశారు. దేశం పేరును ఉపయోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించలేరని చురకలు అంటించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి సంస్థలకు కూడా ఈ పేరు ఉందని విమర్శలు గుప్పించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు I-N-D-I-A కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.

More Telugu News