Vishnu Kumar Raju: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 23 సీట్లే: విష్ణుకుమార్ రాజు

Vishnu Kumar Raju says YCP will get only 23 seats in next elections
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
  • మరో 8 నెలల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని వెల్లడి
  • అతి తక్కువ దూరానికి హెలికాప్టర్ ఉపయోగించింది జగనే అంటూ వ్యంగ్యం
  • జగన్ గిన్నిస్ ఎక్కాల్సిన వారని ఎద్దేవా
ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మరో 8 నెలల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది 23 సీట్లేనని అన్నారు. 

సీఎం జగన్ హెలికాప్టర్ ప్రయాణాలపైనా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కాల్సిన వారని ఎద్దేవా చేశారు. అతి తక్కువ దూరానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించిన వ్యక్తిగా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. సీఎం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ వన్ అంటారు... అసలు, రాష్ట్రంలో బిజినెస్ ఎక్కడ జరుగుతోంది? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని వెల్లడించారు. విశాఖ ఎంపీ భవనాల వాస్తు కోసం రోడ్డును మూసేశారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. రోడ్డు మూసేసి విశాఖ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ పనితీరు దారుణం అని కేంద్రమంత్రి చెప్పారని వెల్లడించారు. 

అటు, మార్గదర్శి అంశంపైనా విష్ణుకుమార్ రాజు స్పందించారు. డిఫాల్టర్ ను పట్టుకుని మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మార్గదర్శిపై చర్యలు రాజకీయ కక్ష సాధింపుగానే అనిపిస్తున్నాయని విమర్శించారు.
Vishnu Kumar Raju
Jagan
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News