Bifurcation Act: విభజన చట్టంలోని కీలక అంశాలపై పార్లమెంటుకు కేంద్ర హోంశాఖ నివేదిక

  • విభజన అంశాలపై ప్రశ్నలు అడిగిన టీడీపీ ఎంపీలు రామ్మోహన్, కేశినేని
  • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
  • విభజన సమస్యలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని సూచన
  • కేంద్రం మధ్యవర్తిగానే వ్యవహరిస్తుందని స్పష్టీకరణ
Union Home Ministry explains bifurcation act details in Parliament

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా, విభజన చట్టంలోని వివిధ అంశాలతో కూడిన నివేదికను కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు వివరించింది. ఇందులో మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు, దీర్ఘకాల ప్రాజెక్టుల వివరాలను పొందుపరిచింది. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ నివేదికతో కూడిన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్ర హోంశాఖ నివేదికలోని వివరాలు...

  • ఏపీలో రాజధాని నిర్మాణం, వర్సిటీల ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.21,154 కోట్లు ఇచ్చాం. 
  • రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు విడుదల చేశాం. 
  • పోలవరం ప్రాజెక్టుకు రూ.14,969 కోట్లు ఇచ్చాం. 
  • ఐఐటీ స్థాపనకు రూ.1,022 కోట్లు, ఐసర్ కు రూ.1,184 కోట్లు విడుదల చేశాం. 
  • ఎయిమ్స్ కు రూ.1,319 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి రూ.24 కోట్లు విడుదల చేశాం.
  • అగ్రికల్చర్ యూనివర్సిటీకి రూ.135 కోట్లు విడుదల చేశాం. 
  • రూ.106 కోట్లతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లు కేటాయించాం. 
  • దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. సమీపంలో పలు పోర్టులు ఉండడంతో, పోటీ తీవ్రమైన కారణంగా ఆచరణ సాధ్యం కాలేదు.
  • రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. రామాయపట్నం పోర్టును ఇప్పటికే నాన్ మేజర్ పోర్టుగా నోటిఫై చేశారు. రామాయపట్నం మైనర్ పోర్టును డీ నోటిఫై చేయాలని ఏపీకి చెప్పాం.
  • రామాయపట్నం కాదనుకుంటే మేజర్ పోర్టు ఏర్పాటుకు మరో ప్రదేశం గుర్తించాలని సూచించాం
  • కడప జిల్లా స్టీల్ ప్లాంట్ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదు. స్టీల్ ప్లాంట్  ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
... అంటూ మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటుకు తెలిపారు. ఇక, విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగానే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

More Telugu News