Ishan Kishan: ప్రతిసారి అలా ఆడాల్సిన అవసరం లేదు.. ‘బజ్‌బాల్’ క్రికెట్‌పై ఇషాన్ కిషన్ వ్యాఖ్యలు

  • వెస్టిండీస్‌తో రెండో టెస్టులో దూకుడుగా ఆడిన టీమిండియా
  • ‘బజ్‌బాల్’ క్రికెట్‌ను భారత్ అలవాటు చేసుకుందా? అనే చర్చ
  • పరిస్థితిని బట్టి వేగంగా పరుగులు సాధించాలన్న ఇషాన్ కిషన్
  • ప్రతి మ్యాచ్‌లో వేగంగా పరుగులు చేయాలని చూడకూడదని వ్యాఖ్య
ishan kishan gives blunt response on bazball cricket

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పలు బ్యాటింగ్ రికార్డులను టీమిండియా నెలకొల్పిన విషయం తెలిసిందే. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరు సాధించి ‘బజ్‌బాల్‌ (ఏ తరహా క్రికెట్ అయినా దూకుడుగా ఆడటం)’ క్రికెట్ రుచిచూపింది. టెస్టు చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఇందులో ఇషాన్ కిషన్‌ (52*) వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ తరహా ‘బజ్‌బాల్’ క్రికెట్‌ను టీమ్‌ఇండియా కూడా అలవాటు చేసుకుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది. ఈ విషయంపై ఇషాన్‌ కిషన్‌ కూడా స్పందించాడు. టెస్టు క్రికెట్‌లో ప్రతిసారి ఫాస్ట్‌గా ఆడాల్సిన అవసరం లేదని, పరిస్థితిని బట్టి వేగంగా పరుగులు సాధించాలని చెప్పాడు. పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది కూడా చాలా కీలకమని వివరించాడు.

‘‘విండీస్‌ పిచ్‌లు కఠినంగా ఉంటాయి. ఇక్కడ క్రీజ్‌లో నిలదొక్కుకుంటేనే పరుగులు సాధించే అవకాశాలు ఉంటాయి. అందుకే పిచ్‌ను అర్థం చేసుకోవాలి. టీమ్‌ఇండియాలో ఇలా ఆడే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు. 

ఏ ఫార్మాట్‌లో ఎలా ఆడాలి? ఎవరి పాత్ర ఏంటి? అనే విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉందని ఇషాన్ కిషన్ చెప్పాడు. అందుకే ప్రతి మ్యాచ్‌లోనూ వేగంగా పరుగులు చేయాలని చూడకూడదని, అప్పటి పరిస్థితికి అనుగుణంగా ఆడాలని సూచించాడు. 

‘‘నేను రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో ఆడినప్పుడు.. ‘నీ ఆటతీరును ప్రదర్శించు. ఒత్తిడికి గురి కావద్దు’ అని రోహిత్ శర్మ చెప్పాడు. ఇలా కెప్టెన్‌ మన మీద భరోసా ఉంచినప్పుడు యువ క్రికెటర్‌గా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది’’ అని ఇషాన్‌ వివరించాడు.

More Telugu News