Elon Musk: ట్విట్టర్ పేరు, బ్లూ బర్డ్‌ను ఎందుకు తొలగించామంటే...!: ఎలాన్ మస్క్ వివరణ

  • ట్విట్టర్ ను సూపర్ యాప్ గా మార్చే ఉద్దేశ్యంలో భాగంగానే మార్పు
  • వాక్ స్వాతంత్రానికి గుర్తుగా ట్విట్టర్ ను మార్చాలని కొనుగోలు చేసినట్లు మస్క్ వెల్లడి
  • 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విట్టర్ పేరు సరిపోతుందని వ్యాఖ్య
  • మున్ముందు అన్నింటికి అనుకూలంగా ట్విట్టర్ లేదా ఎక్స్
Elon Musk explains why hes dumping Twitter name and iconic bird logo

ట్విట్టర్ పేరును, లోగోను మార్చడంపై ఎలాన్ మస్క్ వివరణ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ట్విట్టర్ బ్లూ బర్డ్ స్థానంలో ఎక్స్‌ను తీసుకు వచ్చారు. తద్వారా ట్విట్టర్ పేరును కూడా ఎక్స్‌గా మార్చినట్లు అయింది. ట్విట్టర్ పేరును మార్చడంపై చర్చ సాగుతోంది. అయితే ఈ చర్చకు ఎలాన్ మస్క్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేశారు. ట్విట్టర్ ను ఇకపై సూపర్ యాప్ గా మార్చాలని భావిస్తున్నానని, ఈ ఉద్దేశ్యంతోనే పేరు, లోగా మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపార కమ్యూనికేషన్, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ సహా విస్తృత ప్లాట్ ఫామ్ గా దీనిని మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు.

వాక్ స్వాతంత్రానికి గుర్తుగా ట్విట్టర్ ను మార్చాలని ఎక్స్ కార్పోరేషన్ దీనిని కొనుగోలు చేసిందని, అందులో భాగంగానే ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చామని మస్క్ తెలిపారు. కేవలం పేరు మార్చుకోవడం కాదని, ఇకపై ట్విట్టర్ లేదా ఎక్స్ అదే పని చేస్తుందన్నారు. ట్వీట్ కు 140 అక్షరాల పరిమితి ఉన్నప్పుడు ట్విట్టర్ అనే పేరు సరిపోతుందని, కానీ ఇప్పుడు ఆ పేరు ఉండటంలో అర్థం లేదన్నారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్ద సైజ్ వీడియోలు కూడా షేర్ చేయవచ్చునన్నారు. మరికొన్ని నెలల్లో ట్విట్టర్ లో కీలక మార్పులు రానున్నట్లు చెప్పారు.

ఇకపై యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఇతర యాప్స్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదని, ఈ వేదికను అన్నింటికి అనుకూలంగా మార్చనున్నట్లు చెప్పారు. ఇప్పటికే వీడియోకు సంబంధించి కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఎక్స్ వేదిక మీ మొత్తం ఆర్థిక ప్రపంచాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. చెల్లింపులు, బ్యాంకింగ్ వంటి ఫిన్ టెక్ ఫీచర్లను కూడా ఎక్స్ కలిగి ఉండనుందని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లిండా యాకారినో తెలిపారు.

More Telugu News