AP High Court: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్.. ఆయన గురించి కొన్ని వివరాలు!

Justice Dheeraj Singh is new Chief Justice of AP High Court
  • ఈ నెల 5న జస్టిస్ ధీరజ్ సింగ్ పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
  • సీజేఐ చంద్రచూడ్ ను సంప్రదించి ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి
  • మాజీ సీజేఐ తీరథ్ సింగ్ తమ్ముడే జస్టిస్ ధీరజ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. జస్టిస్ ధీరజ్ పేరును ఈ నెల 5న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో ఏపీ నూతన చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ను సంప్రదించిన అనంతరం ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరథ్ సింగ్ ఠాకూర్ తమ్ముడే జస్టిస్ ధీరజ్ సింగ్. వీరి తండ్రి దేవీదాస్ ఠాకూర్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ... సుప్రీంకోర్టు న్యాయవాదిగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పని చేశారు. 

జస్టిస్ ధీరజ్ సింగ్ స్వరాష్ట్రం జమ్మూకశ్మీర్. 1989 అక్టోబర్ లో ఢిల్లీ, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ అడ్వొకేట్ గా పదోన్నతి పొందారు. 2013 మార్చిలో జమ్మూకశ్మీర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ లో బాంబే హైకోర్టుకు బదిలీ అయి ప్రస్తుతం అక్కడే సేవలు అందిస్తున్నారు.
AP High Court
Chief Justice
Dheeraj Singh

More Telugu News