Chhattisgarh: నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడి అనూహ్య మరణం

Chhattisgarh child dies after lizards falls in his mouth obstructing air passage
  • ఛత్తీస్‌ఘడ్ కోర్బా జిల్లాలో ఘటన
  • బిడ్డను మంచంపై పడుకోబెట్టి ఇంటిపనుల్లో నిమగ్నమైన తల్లి
  • ఈలోపు బాలుడి నోట్లో బల్లి పడటంతో ఊపిరాడక చిన్నారి మరణం
నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు అనూహ్య రీతిలో మరణించాడు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు. అందరిలోకి చిన్నవాడైన జగదీశ్ వయసు రెండున్నర ఏళ్లు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బాలుడు మంచంపై పడుకుని ఆడుకుంటుండగా తల్లి ఇంట్లో పనుల్లో నిమగ్నమైంది. 

కాగా, ఆమె ఓమారు బిడ్డ వద్దకు రాగా బాలుడు అచేతనంగా కనిపించాడు. బిడ్డ నోట్లో బల్లి కనిపించింది. దీంతో, భయపడిపోయిన మహిళ పెద్ద పెట్టున రోదించడంతో స్థానికులు వచ్చి చూసి చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. అయితే, బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే స్పష్టం చేశారు. బల్లి శ్వాసకోశ నాళానికి అడ్డం పడటంతో ఊపిరాడక చిన్నారి మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. పోస్ట్‌మార్టం తరువాతే అసలు కారణం ఏంటో వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.
Chhattisgarh
infant death

More Telugu News