Anju: ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన భారత మహిళ... పాక్ జాతీయుడు ఏమన్నాడంటే....!

  • భారత మహిళ అంజుకు ఫేస్ బుక్ లో పరిచయమైన పాక్ యువకుడు
  • అంజు వివాహిత
  • 2019 నుంచి పాక్ యువకుడు నస్రుల్లాతో ఆన్ లైన్ స్నేహం
  • తమ మధ్య లవ్ యాంగిల్ లేదన్న పాక్ యువకుడు
  • ఆమె తిరిగి భారత్ వెళ్లిపోతుందని స్పష్టీకరణ
Pakistan man says there is no love angle with Anju the Indian woman who left country to meet Facebook friend

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్ అనే పాక్ మహిళ భారత్ వచ్చింది. అలాగే, పోలెండ్ నుంచి కూడా ఓ మహిళా భారత్ చేరుకుంది. 

తాజాగా, భారత్ కు చెందిన 34 ఏళ్ల అంజు అనే వివాహత ఫేస్ బుక్ లో పరిచయం అయిన పాకిస్థాన్ జాతీయుడు నస్రుల్లా కోసం దేశం విడిచిపెట్టింది. నస్రుల్లా వయసు 29. అంజు అన్ని పత్రాలతో పాకిస్థాన్ వెళ్లినప్పటికీ, నస్రుల్లా నుంచి ఊహించని స్పందన వచ్చింది. 

ఇందులో ప్రేమ కోణం ఏమీ లేదని, అంజు తిరిగి భారత్ వెళ్లిపోతుందని ఆ పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారతీయ మహిళ అంజును పెళ్లి చేసుకునే ఆలోచనేదీ తనకు లేదని నస్రుల్లా స్పష్టం చేశాడు. 

అంజు స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని కల్లోర్ గ్రామం. ఆమె ప్రస్తుతం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో నివసిస్తోంది. ఆమెకు పాకిస్థానీ యువకుడు నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం అయింది. సాన్నిహిత్యం పెరగడంతో అతడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతం ఖైబర్ పంక్వుక్వాలోని అప్పర్ దిర్ జిల్లా చేరుకుంది. 

నస్రుల్లా ఓ సైన్స్ గ్రాడ్యుయేట్. షెరింగల్ వర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. అతడిది పెద్ద కుటుంబం. ఐదుగురు సోదరుల్లో అందరికంటే చిన్నవాడు. 2019 నుంచి అంజు, నస్రుల్లా మధ్య ఫేస్ బుక్ ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. 

కాగా, భారత్ నుంచి తన కోసం ఓ మహిళ రావడం పట్ల పాక్ అధికారులు నస్రుల్లాను వివరణ కోరారు. దాంతో, ఆ యువకుడు పాక్ ప్రభుత్వ వర్గాలకు అఫిడవిట్ సమర్పించాడు. తమ మధ్య ప్రేమ వ్యవహారం లేదని, ఆగస్టు 20న ఆమె తిరిగి భారత్ వెళ్లిపోతుందని స్పష్టం చేశాడు. తమది కేవలం స్నేహం అని వెల్లడించాడు.

More Telugu News