Yarlagadda Venkata Rao: గన్నవరం నుంచే పోటీ చేస్తా.. వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటన!

  • గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతానన్న యార్లగడ్డ
  • తాను అజ్ఞాతవాసంలో ఉన్నానని వెల్లడి
  • ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్న ప్రశ్నకు దాటవేత
  • హనుమాన్ జంక్షన్ లో దుట్టా రామచంద్రారావుతో భేటీ
Yarlagadda Venkata Rao says he contests from gannavaram

వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే తాను కొనసాగుతానని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తాను అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారని మండిపడ్డారు.

ఈ రోజు వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో రెండు గంటలకు వీరి సమావేశం కొనసాగింది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను గన్నవరంలోనే ఉన్నానని, ఇక్కడి రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. 

‘‘నేను అజ్ఞాతవాసంలో ఉన్నా. రెండేళ్ల నుంచి రాజకీయంగా ఉన్న ఇబ్బందుల వల్ల కార్యకర్తలకు ఏం చేయలేకపోయాను” అని చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు.

2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విజయం సాధించారు. తర్వాత రాజకీయా పరిణామాల నేపథ్యంలో వంశీ వైసీపీకి మద్దతుగా వున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి వంశీకే టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ భేటీ ప్రధాన్యం సంతరించుకుంది.

More Telugu News