Harirama Jogaiah: వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు... పవన్ కల్యాణ్ కు మద్దతు పలికిన హరిరామజోగయ్య

  • వాలంటీర్ వ్యవస్థపై పవన్ విమర్శనాస్త్రాలు
  • పవన్ ను సమర్థించిన హరిరామజోగయ్య
  • పలు సూచనలు, సలహాలతో పవన్ కు లేఖ
Harirama Jogaiah wrote Pawan Kalyan on volunteers issues

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, వాలంటీర్లు సేకరించిన డేటా ఎవరి చేతుల్లో ఉందంటూ జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్నిరోజులుగా పోరాటం సాగిస్తున్నారు. పవన్ పోరాటానికి కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య మద్దతు పలికారు. 

అవసరం అనుకుంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న పవన్ ఆలోచన మంచిదేనని సమర్థించారు. అయితే, పూర్తిగా రద్దు చేయడం కంటే కొన్ని అంశాల్లో సంస్కరణలతో వాలంటీర్ వ్యవస్థను పునర్ నిర్మించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థలో అత్యధికంగా మహిళలకే అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 

సంక్షేమ పథకాల అమలులో కంటే, అధికార పార్టీ ప్రయోజనాల కోసమే వాలంటీర్లను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువమంది వైసీపీ వాళ్లేనని  హరిరామజోగయ్య పేర్కొన్నారు. అందువల్లే ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థ జోక్యం చేసుకోరాదని జీవో ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. 

ఇక, వాలంటీర్ల సమస్యలను కూడా హరిరామజోగయ్య తన లేఖలో ప్రస్తావించారు. వాలంటీర్ల సమస్యలను పరిష్కరించే దిశగా పవన్ కల్యాణ్ కృషి చేయాలని సూచించారు. రెండున్నరల లక్షల మంది వాలంటీర్లు రూ.5 వేల అరకొర వేతనంతో జీవిస్తున్నారని వివరించారు. 

వాలంటీర్లకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండేలా చూసి, వారికి కనీస వేతనం రూ.10 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

More Telugu News