Seema Haider: ధ్రువీకరణ కోసం.. పాక్​ ఎంబసీకి సీమా హైదర్​ గుర్తింపు కార్డులు!

Seema Haider identity documents sent to Pakistan embassy for verification
  • ప్రియుడి కోసం భారత్‌కు అక్రమంగా వచ్చిన పాకిస్థానీ
  • ఆమెను పాక్ గూడఛారిగా అనుమానిస్తున్న దర్యాప్తు సంస్థలు
  • సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
నోయిడాలోని తన ప్రేమికుడితో కలిసి జీవించడానికి భారత్‌లోకి అక్రమంగా వచ్చిన పాకిస్థానీ జాతీయురాలు సీమా హైదర్ నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని పత్రాలను నోయిడా పోలీసులు ఆమె గుర్తింపును ధ్రువీకరించడానికి ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయానికి పంపారు. 

సీమా హైదర్ తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి జీవించడానికి మేలో తన నలుగురు పిల్లలతో అక్రమంగా నేపాల్ మీదుగా భారత్‌లోకి రావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 4న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి హైదర్ పాకిస్థాన్ గూఢచారి అనే అనుమానంతో భద్రతా ఏజెన్సీలు సైతం ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలో సీమా హైదర్ పాస్‌పోర్ట్, పాకిస్థాన్ గుర్తింపు కార్డు, ఆమె పిల్లల పాస్‌పోర్ట్‌లు సహా అన్ని పత్రాలను పోలీసులు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నారు.

ఆమె పాకిస్థానీ జాతీయురాలా? కాదా? అని నిర్ధారించుకోవడానికి ఈ పత్రాలన్నీ పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి పంపించారు. కాగా, సీమా హైదర్ మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. తన ఫోన్ నుంచి ఎలాంటి డేటాను తొలగించలేదని సీమా హైదర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొంది. తదుపరి విచారణ కోసం పోలీసులు ఆమె స్వాధీనం చేసుకున్న మొబైల్‌ను ఘజియాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక, పాకిస్థాన్ నుంచి సీమా గుర్తింపు నిర్ధారణ అయ్యేంత వరకు దర్యాప్తు కొనసాగనుంది. వీటిని నిర్ధారించిన తర్వాతనే కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను సిద్ధం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
Seema Haider
Pakistan
identity
embassy
noida
police

More Telugu News